Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

  • విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  • వరద ప్రభావాన్ని పరిశీలించేందుకు ఏరియల్ సర్వే
  • రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా
  • గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని వెల్లడి
  • ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చంద్రబాబు ఎంతో శ్రమించారని కితాబు

ఇవాళ విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం… ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని పేర్కొన్నారు. 

ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని, త్వరగా కేంద్ర ప్రభుత్వ సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థికసాయం ప్రకటిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

విజయవాడ ప్రజలు ఐదు రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయారని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమించారని కేంద్రమంత్రి కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయక చర్యలు పర్యవేక్షించారని కితాబిచ్చారు. 

వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చక్కగా నిర్వర్తించారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు అందించారని… పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.

అంతకుముందు, వరద ముంపునకు గురైన ప్రాంతాలను ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు స్వయంగా వివరించారు. అంతేకాదు, కేంద్రమంత్రితో చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమై రాష్ట్రానికి వరద సాయంపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

Related posts

భారీ చెట్టును కొట్టేయ‌కుండానే ఇల్లు క‌ట్టుకున్న వ్య‌క్తి.. 

Drukpadam

కోవిడ్ పై క్షేత్ర స్థాయిలో అవగాహన చర్యలు, వాక్సినేషన్ ఏర్పాట్లు చేపట్టండి౼ మంత్రి పువ్వాడ.

Drukpadam

అక్షరాల పరిమితి లేకుండా కొత్త ఫీచర్ తీసుకువస్తున్న ట్విట్టర్!

Drukpadam

Leave a Comment