ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్
ప్రజా సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి లు కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లా మత్సకారుల సహకార సంఘం సభ్యులు, జిల్లా కలెక్టర్ ను కలిసి ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులు అన్ని సంఘాల పరిధిలోని జల వనరులలో లక్షలాది రూపాయల విలువైన చేప పిల్లలను వదలగా, అంతా కొట్టుకుపోవడం వల్ల కోట్లాది రూపాయల విలువైన సంపదను కోల్పోయామని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు అందజేయగా, జరిగిన నష్ట వివరాలను ప్రభుత్వానికి పంపి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చింతకాని మండలం ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీకి చెందిన తూడెం మరియమ్మ అనే రైతు తమ కుటుంబానికి ఉన్న 1,42,669 రూపాయల పంట రుణాలను రుణమాఫీ పథకం క్రింద మాఫీ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వ్యవసాయ శాఖ అధికారిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వైరా మండల కేంద్రానికి చెందిన వి. డేవిడ్ బీసీ సంక్షేమ గురుకులంలో 5వ తరగతి ప్రవేశం కొరకు పరీక్ష రాయగా అశ్వరావుపేట లో సీటు వచ్చిందని, అమ్మా, నాన్న ఆరోగ్యం బాగా లేనందున అంత దూరం వెళ్ళలేక పోతున్నానని, దగ్గర్లోని బీసీ సంక్షేమ గురుకులాల్లో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేయగా, జిల్లా బీసీ అభివృద్ధి అధికారికి రాస్తూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో ఓల్డ్ ఎన్టీఆర్ కెనాల్ కొరకు సేకరించిన 34.5 కుంటల భూమిని జేవిఆర్ ఓసి ప్రాజెక్టు 2 వారు తీసుకున్నందున భూమికి జారీ చేసిన అవార్డు ప్రకారం నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ నిర్వాసితులు దరఖాస్తు చేసుకోగా, భూ సేకరణ అధికారికి రాస్తూ తనిఖీ చేసి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
పెద్దగోపతి గ్రామానికి చెందిన జి. కుమారి తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గోన్నారు.