Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

హైడ్రా బాధితుల బాధలు విని ఎమోషనల్ అయిన హరీశ్ రావు!

  • బీఆర్ఎస్ భవన్‌కు వచ్చిన హైడ్రా బాధితులు
  • మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామన్న రేవంత్ పేదల కన్నీళ్లు పారిస్తున్నారని హరీశ్ విమర్శ
  • రేవంత్ రెడ్డి తన సోదరుడి ఇంటికి బుల్డోజర్లు పంపించగలడా? అని ప్రశ్న

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎమోషనల్ అయ్యారు. హైడ్రా బాధితులు ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ ఇళ్ల కోసం ఏళ్లుగా కష్టపడ్డామని, అలాంటి ఇళ్లు తమ కళ్ల ముందే కూలిపోతుంటే తట్టుకోలేకపోతున్నామని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి పరిస్థితిని చూసి హరీశ్ రావు భావోద్వేగాలకు లోనయ్యారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు.

గోదావరి నీళ్లు పారిస్తానని పేదల కన్నీళ్లు పారిస్తున్నారు

మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. పేదల కన్నీటిపై అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. సామాన్యుల ఇళ్లను కూలగొడుతున్న రేవంత్ రెడ్డి తన సోదరుడి ఇంటికి బుల్డోజర్లు పంపించగలరా? అని నిలదీశారు.

పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం బాధితుల వద్దకు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో పాలన చేస్తున్నారన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అని చెప్పి మాట తప్పారని, ఇప్పుడు ప్రజలను రోడ్డున పడేశారని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్‌ను రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఆ తర్వాతే ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లిలో హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, అది రేవంత్ రెడ్డి చేసిన హత్య అన్నారు. హైడ్రా ఇళ్లను కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో ఆమె ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు.

బుల్డోజర్ పాలనను ఒప్పుకునేది లేదని హర్యానాలో రాహుల్ గాంధీ నీతులు చెబుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మొదట తెలంగాణకు వచ్చి బుల్డోజర్ రాజ్యాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా బాధితులు అందరూ తమ కుటుంబ సభ్యులేనని, వారి కోసం బీఆర్ఎస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. 

గాంధీ ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీఆర్ఎస్ వర్గీయులు వాదనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Related posts

జన్వాడలోని కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడులు…

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పొంగులేటి …జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం …

Ram Narayana

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Ram Narayana

Leave a Comment