- కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ వేలకోట్లు దండుకుందన్న మంత్రి
- ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ అదే పనిచేస్తోందని వ్యాఖ్య
- బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్న బండి సంజయ్
- వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని వెల్లడి
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నిత్యం నగరంలో ఎక్కడో ఒకచోట కూల్చివేతలు చేపడుతూ వార్తల్లో నిలుస్తోందీ సంస్థ. అయితే, తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు కూడబెట్టినట్లే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా హైడ్రా పేరిట వేల కోట్లు దండుకుంటోందని ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో పేదల తరఫున నిలబడి పోరాడతామని అన్నారు. బీజేపీ ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందన్న ఆయన.. వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు. ఇక కరీంనగర్‌లో విలీన గ్రామాలపై కూడా స్పందించిన మంత్రి గ్రామాలను విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం తీసుకోవాలని చెప్పారు.
అలాగే తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడాన్ని విమర్శించారు. తాము ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ తరహా వారసత్వ రాజకీయాలు ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు.