- మెడ చుట్టూ ఉన్నది జున్ను అని గుర్తించిన పురావస్తు శాస్త్రవేత్తలు
- 2003లో చైనాలోని వాయవ్య ప్రాంతంలో శవపేటిక గుర్తింపు
- పొడి వాతావరణం కారణంగా చెక్కు చెదరకుండా ఉన్న శవపేటిక, మమ్మీ
రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో వెలికితీసిన 3,600 ఏళ్ల నాటి మమ్మీ మెడ చుట్టూ ఉన్న అంతుచిక్కని పదార్థం ఏమిటో పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. మమ్మీ మెడలో ఆభరణాల మాదిరిగా చుట్టిన అస్పష్టమైన పదార్థం ‘జున్ను’ అని గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన అతి పురాతనమైన జున్ను ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు ‘సెల్’ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.
‘‘ జున్ను సాధారణంగా మృదువుగా ఉంటుంది. కానీ మమ్మీ మెడ చుట్టూ ఉన్నది ఎండిపోయి, గట్టిగా, పొడిగా మారింది’’ అని బీజింగ్‌లోని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పాలియోజెనెటిస్ట్, అధ్యయనం సహ రచయిత ఫు కియామీ వెల్లడించారు. జున్ను డీఎన్ఏను విశ్లేషించగా జియోహే ప్రజల (నేటి జిన్‌జియాంగ్ ప్రాంతం) జీవన విధానానికి సంబంధించిన కొన్ని అంశాలపై స్పష్టత వస్తుందని, వారు పెంచిన క్షీరదాలు, తూర్పు ఆసియాలో పశుపోషణపై కీలక విషయాలు తెలుస్తాయని ఫు కియామీ వివరించారు.
కాగా 2003లో జియోహే శ్మశానవాటిక తవ్వకాలు చేపట్టగా కాంస్య యుగం శవపేటిక లభ్యమైంది. తారిమ్ బేసిన్ ఎడారి ప్రాంతంలో దీనిని గుర్తించారు. శవ పేటికలో ఒక మమ్మీ ఉంది. ఆ ప్రాంతంలో పొడి వాతావరణం కారణంగా శశ పేటిక, మమ్మీ చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. బూట్లు, టోపీతో పాటు శరీరాన్ని జున్నుతో అలంకరించారు. పురాతన కాలంలో చనిపోయినవారిని ఖననం చేసేటప్పుడు వారు ఎక్కువగా వాడిన వస్తువులను కూడా ఖననం చేసేవారు. ఈ మమ్మీ ఒంటి మీద జున్నును గుర్తించడంతో ఇది నాటి ప్రజల జున్ను వినియోగాన్ని సూచిస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు అంటున్నారు.