- అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు
- 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు
- నలుగురు నిందితుల అరెస్టు
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం సృష్టించింది. ఓ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా నుంచి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కిలోల కొకైన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పక్కా సమాచారంతో పోలీస్ స్పెషల్ సెల్ బృందం దక్షిణ ఢిల్లీలో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో నలుగురు వ్యక్తుల నుంచి 560 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో ఈ మాదక ద్రవ్యాల విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
కాగా, ఇటీవల ఢిల్లీ పోలీసులు ఇద్దరు ఆఫ్ఘనిస్థాన్ పౌరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించగా.. భారీగా డ్రగ్స్ దందా నడిపిస్తున్న ఈ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయిందని పోలీసులు తెలిపారు.