- ఊహించని రీతిలో ఫలితాలు ఉన్నాయంటున్న కాంగ్రెస్ పార్టీ
- ఫలితాల అప్‌డేటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగిందని ఈసీకి ఫిర్యాదు
- అలాంటిదేమీ లేదని కొట్టిపారేసిన ఎన్నికల సంఘం
ఓట్ల లెక్కింపు ఆరంభంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యం.. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ లీడ్‌లోకి దూసుకొచ్చి ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకున్న వైనం. ఎగ్జిట్ పోల్ అంచనాలకు కూడా అందని ఫలితం ఇదీ. ఏమాత్రం ఊహించని హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఊహించని రీతిలో, షాక్‌కు గురిచేసేలా ఈ ఫలితాలు ఉన్నాయని, అంగీకరించలేని విధంగా ఉన్నాయని హస్తం పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. గంటల వ్యవధిలో ఫలితాలు తారుమారు అయ్యాయని చెబుతోంది.
ఈ మేరకు సందేహాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఒక లేఖ రాసింది. హర్యానా ఎన్నికల ఫలితాల అప్‌డేటింగ్ ప్రక్రియ వర్ణించలేనంత మందకొడిగా కొనసాగిందంటూ పేర్కొంది. ‘‘ ఈ తరహా విధానాలు ఈసీ విశ్వసనీయతను తగ్గిస్తాయని మీరు కూడా ఊహించవచ్చు. ఈ మేరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఉదాహరణలను మీరు గమనించవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న చోట ప్రభావం పడుతుంది’’ అని ఈసీకి రాసిన లేఖలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియతో కూడా మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టివేసింది. ప్రతి ఐదు నిమిషాలకు అప్‌డేట్ చేశామని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 90 నియోజకవర్గాలు ఉండగా ప్రతి 5 నిమిషాలకు 25 రౌండ్ల ఫలితాలను అప్‌డేట్ చేసినట్టు పేర్కొంది.
కాంగ్రెస్ సందేహాలు ఇవే..
ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి సందేహాలు వ్యక్తం చేసింది. ఈవీఎంలతో పాటు ఎన్నికల కౌంటింగ్‌లో స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని మీడియా సమావేశంలో జైరాం రమేశ్ ఆరోపించారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం కాబట్టి ‘డబుల్’ ఇంజిన్ ఒత్తిడి చేశారని, అందుకే తమ అభ్యర్థులు 50, 100, 250 ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా మాట్లాడుతూ ఈవీఎంల బ్యాటరీలపై సందేహాలు వ్యక్తం చేశారు. హిసార్, మహేంద్రగఢ్, పానిపట్ జిల్లాల నుంచి ఈవీఎం బ్యాటరీలకు సంబంధించి నిరంతరం ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఈవీఎం బ్యాటరీల్లో 99 శాతం ఛార్జింగ్ ఉన్న చోట ఫలితాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని, బ్యాటరీలు 60-70 శాతం ఉన్నచోట ఫలితాలు తమకు అనూకూలంగా వచ్చాయని అన్నారు. 60-70 ఛార్జింగ్ ఉన్న ఈవీఎంలు సహజమైనవని, అందుకే తమ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదులు సమర్పించారని చెప్పారు. త్వరలోనే ఈ ఫలితాలపై ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పవన్ ఖేరా చెప్పారు.