Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రైవేటు’లో మీకంటే గొప్పవారు ఉన్నారా?: డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్‌

ప్రైవేటు’లో మీకంటే గొప్పవారు ఉన్నారా?: డీఎస్సీ విజేతలతో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: డీఎస్సీ విజేతలను చూస్తే దసరా పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. టీచర్లే తెలంగాణ వారధులు.. నిర్మాతలని, పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందని తెలిపారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ కొత్త టీచర్లకు కీలక సూచనలు చేశారు.

నిరుపేదలు బంగారం అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపే పరిస్థితి మారాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించాలన్నారు. ‘‘తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వారిని భవిష్యత్తులో డాక్టర్లుగా, లాయర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే. నేను ప్రభుత్వ బడిలో చదువుకున్నా.. సీఎం అయ్యాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేశవరావు, కోదండరాం వంటి ఎందరో ప్రభుత్వ బడిలోనే చదివారు. కార్పొరేట్‌ బడిలో చదువుకోలేదు. మీలాంటి టీచర్లు చెప్పిన చదువుతోనే ఈ స్థాయికి వచ్చాం. జాతి నిర్మాతలను తీర్చిదిద్దిన క్షేత్రం ప్రభుత్వ బడి. తెలంగాణలో 30వేల పాఠశాలలు ఉంటే.. 24లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు యాజమాన్యంలో 10 వేల పాఠశాలలు ఉంటే 34లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటులో మీకంటే ఎక్కువ చదువుకున్నవారు, మీకన్నా గొప్ప వ్యక్తులు, అనుభవం ఉన్నవారు బోధిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు.
ఎందుకలా జరుగుతోందో ఆలోచించండి..

‘‘ప్రభుత్వ బడికి వెళ్లడమంటేనే గ్రామాల్లో సైతం నామోషీగా భావిస్తున్నారు. ఉపాధి హామీ కూలికి పోయిన వారు కూడా తాము తిన్నా తినకపోయినా, పుస్తెలు అమ్మి అయినా తమ పిల్లలను ప్రైవేటు బడి, కాన్వెంట్‌కు పంపాలనుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలకు పంపాలంటే.. ఎందుకు ఇబ్బందిపడుతున్నారో ఆలోచించండి. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా.. కానీ, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మీరు కృషిచేయండి. స్కూళ్లలో అన్ని వసతులూ కల్పించేందుకు కృషిచేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభిస్తున్నాం. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు శ్రీకారం చుడుతున్నాం. విద్యకు బడ్జెట్‌లో రూ.25వేల కోట్లు కేటాయించాం. ఐటీఐలను అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరిస్తున్నాం.
65 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేశాం..

‘‘ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. రెండుసార్లు కోరి కొఱవి దెయ్యాన్ని తెచ్చుకున్నట్లుగా బీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చాం. ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించినా.. తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తి చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదు. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పాను. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. 90 రోజుల్లో 30వేల కొలువులు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేశాం. 65 రోజుల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేశాం.
పేదల గురించి ఆలోచించలేదు గానీ.. కవితకు ఎమ్మెల్సీ పదవి..

రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వ బడుల పాత్ర కీలకం. డీఎస్సీ నోటిఫికేషన్‌ అడ్డుకోవాలని కొఱవి దెయ్యాలు యత్నించాయి. కేసులు వేసి డీఎస్సీ నోటిఫికేషన్‌ అడ్డుకోవడానికి కుట్రలు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భవిష్యత్తు తరాలకు టీచర్లు ఆదర్శంగా మారబోతున్నారు. డీఎస్సీ విజేతల సంతోషాన్ని చూసి కొందరు కళ్లల్లో కారం పెట్టుకొంటారు. ఎంపీగా కవిత ఓడిపోగానే కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పేదల గురించి ఆలోచించలేదు గానీ.. కుమార్తెకు మాత్రం 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పేదల మేలు కోసం విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తున్నాం. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వాలి. తెలంగాణ సమాజంపై బీఆర్‌ఎస్‌కు ఎందుకంత కోపం? ఏడు లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు పోయాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మా ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్‌ఎస్‌ అంటోంది.. ఇది న్యాయమా? బీఆర్‌ఎస్‌కు అధికారం రాదు.. తెలంగాణ ప్రజలు ఇవ్వరు?
ఒలింపిక్స్‌లో పతకాలు రావడంలేదెందుకు?

విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తాం. రాష్ట్రంలో ఏటా 1.10లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టాలు పొందుతున్నారు. నైపుణ్యాలు పెంపొందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్ వర్సిటీని ప్రారభించాం. స్కిల్‌ వర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందిస్తున్నాం. ఒలింపిక్స్‌ వేదికల్లో దేశం పరిస్థితి ఏంటో చూశాం. నాలుగు కోట్లు జనాభా ఉన్న దక్షిణ కొరియాకు ఒలింపిక్స్‌లో 32 పతకాలు వస్తే.. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌కు ఆ తరహాలో ఒలింపిక్స్‌లో ఎందుకు పతకాలు రాలేదు? తెలంగాణ యువత మత్తుకు బానిసలయ్యారు. వ్యసనాలకు బానిసలై.. యువత తప్పుదోవ పడుతున్నారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు బంగారు పతకాలు రావాలి’’ అని పిలుపునిచ్చారు.

Related posts

ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ …మంత్రి పొన్నం ప్రభాకర్

Ram Narayana

బీఆర్ఎస్ లో చేరుతానని గతంలో బండి సంజయ్ నాతో చెప్పారు: రవీందర్ సింగ్…!

Drukpadam

బీజేపీలోకి సినీ నటి జయసుధ..?

Ram Narayana

Leave a Comment