తెలంగాణ వార్తలు

నసర్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి!

  • హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేపై చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఘటన
  • పల్టీ కొట్టిన ఆటోను కారు ఢీకొట్టిన వైనం
  • మృతులు మటిక తండా వాసులుగా గుర్తింపు

హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే, నలుగురు యువకులు ఆటోలో హైదరాబాద్ నుంచి దేవరకొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో నసర్లపల్లి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వెంటనే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక మృతదేహాలను సైతం స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో వీరంతా దేవరకొండ మండలం ముదిగొండ అవాసం మటిక తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు.. రాత్లావత్ భాస్కర్ (29), రాత్లావత్ వినోద్ (29), సఫవత్ రవి (29)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

గ్రామంలో విషాద ఛాయలు

ఘటన గురించి తెలిసిన వెంటనే మటిక తండా గ్రామంలో విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు, బంధువులు బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. 

Related posts

ఓవరాక్షన్ చేయొద్దు: హైకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక!

Ram Narayana

కమ్యూనిస్టు యోధుడు, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు కన్నుమూత…

Ram Narayana

కేసీఆర్ ను విచారణకు పిలవనున్న జస్టిస్ ఘోష్ కమిషన్…

Ram Narayana