తెలంగాణలో అదనపు కలెక్టర్లకు కియా కార్లు… పరిశీలించిన సీఎం కేసీఆర్
ఒక్కో కారు విలువ రూ.24.95 లక్షలు!
ప్రగతి భవన్ లో కొలువుదీరిన కార్లు 32 జిల్లాల అడిషనల్ కలెక్టర్లకు
కార్ల వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్
జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ
బీజేపీ ఆగ్రహం!
తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్ల అధికారిక వాహనాలుగా కియా కార్లు రంగప్రవేశం చేయనున్నాయి. జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కోసం ప్రభుత్వం 32 కియా కార్లను కొనుగోలు చేసింది. ఈ కార్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో పరిశీలించారు. అధికారులను అడిగి వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఈ కార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఆర్టీఏ శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఆయా వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రగతి భవన్ లో ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ . వారి వెంట ట్రాన్స్పోర్ట్ కమీషనర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
కాగా, ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో కియా కారు విలువ రూ.24.95 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా సంక్షోభ సమయంలో ఇంత ఖర్చుతో కార్లు కొనుగోలు చేయడం అవసరమా? అని ప్రశ్నించింది.