- మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో గతంలో అరెస్టయిన సాయిబాబా
- ఇటీవలే జైలు నుంచి విడుదల
- 10 రోజుల కిందట నిమ్స్ లో చేరిన సాయిబాబా
- గుండెపోటుతో కన్నుమూత
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జైల్లో ఉండి, ఇటీవలే బయటికి వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సాయిబాబా 10 రోజుల కిందట నిమ్స్ లో చేరారు. అయితే, రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారు.
సుదీర్ఘకాలం జైల్లో ఉన్న సాయిబాబా గత మార్చి 7వ తేదీన నిర్దోషిగా నాగపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్తగా ఆయనకు గుర్తింపు ఉంది.
మావోయిస్టు ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనను గతంలో అరెస్ట్ చేశారు. గడ్చిరోలి ట్రయల్ కోర్టు సాయిబాబాతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2017 నుంచి 2024 మార్చి 6 వరకు ఆయన జైలు జీవితం గడిపారు.