- 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక్కడు
- కొన్నాళ్లకే వైసీపీకి దగ్గరైన రాపాక వరప్రసాద్
- ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి
- ఇష్టం లేకపోయినా పోటీ చేశానన్న రాపాక
- త్వరలోనే మరో పార్టీలో చేరుతున్నట్టు వెల్లడి
రాపాక వరప్రసాద్… 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆ ఎన్నికల్లో గెలిచిన కొన్నాళ్లకే రాపాక జనసేనకు దూరమై, అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడాయన వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
వైసీపీతో తన బంధం తెగిపోయినట్టేనని, త్వరలోనే మరో పార్టీలోకి వెళుతున్నానని రాపాక వెల్లడించారు. రాజోలులో ఎంతో కష్టపడి పనిచేసినా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు.
ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, కానీ పార్టీ పెద్దల మాటతో ఎంపీగా బరిలో దిగానని వివరించారు. రాజోలు బరిలో తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారని రాపాక వరప్రసాద్ వెల్లడించారు. త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తానని, ఆ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగబోనని స్పష్టం చేశారు.