- ఈవీఎంల ద్వారా మోసం జరుగుతుందన్న రాచమల్లు
- బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయని వ్యాఖ్య
- ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విన్నపం
ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… 2029 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే పోటీ చేయబోనని తెలిపారు.
ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహిస్తే… పోటీ చేసినా ఫలితం ఉండదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మోసం జరిగినట్టుగానే 2029 ఎన్నికల్లో కూడా మోసం జరుగుతుందని అన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితేనే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయని చెప్పారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో తీర్పు ఇచ్చింది ప్రజలు కాదని… ఈవీఎంలు తీర్పును వెలువరించాయని శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని కౌంటింగ్ పూర్తయిన అరగంటకే ప్రజలు చెప్పారని తెలిపారు. ఈవీఎంలపై ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ… ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు.
వచ్చే ఎన్నికలను కూడా ఈవీఎంల ద్వారా నిర్వహిస్తే… ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని, ఈవీఎంల ద్వారా అప్రజాస్వామిక విధానంలో నాయకులు ఎన్నికవుతుంటారని విమర్శించారు.