- తడ వద్ద తీరం దాటిన వాయుగుండం
- భారీ వర్షాలతో పలు జిల్లాలు అతలాకుతలం
- శ్రీ సత్యసాయి జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్రావతి
- పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
- తీరంలో భయపెడుతున్న రాకాసి అలలు
- వర్షాలపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏపీ ప్రజలను మరోమారు భయం గుప్పిట్లోకి నెట్టాయి. రాయలసీమ సహా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. విశాఖ, కాకినాడ తీరాల్లో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. విశాఖ ఆర్కేబీచ్ వద్ద అలలు భీకర శబ్దంతో దుకాణాల వరకు వచ్చి తాకుతున్నాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. చెట్లు, విద్యుత్తు స్తంభాలతోపాటు పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అంతర్వేదిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోనసీమ జిల్లాలోని ఓడలరేవు తీరంలో అలలు ఉద్ధృతంగా ఎగసిపడుతున్నాయి. గత ఆరు గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటింది. అనంతరం అల్పపీడనంగా బలహీనపడింది.
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లి మండలం వెల్దుర్తి సమీపంలోని చిత్రావతి వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు ముంచెత్తుతుండడంతో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.