Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సజ్జలను విచారించిన మంగళగిరి పోలీసులు!

  • 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి
  • సజ్జలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • నేడు మంగళగిరి పోలీసుల ఎదుట హాజరైన సజ్జల2921

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ కీలక నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళగిరి రూరల్ పోలీసులు నేడు విచారించారు. ఈ కేసులో సజ్జలకు పోలీసులు నిన్న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సజ్జల ఇవాళ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. 

సజ్జలను ప్రశ్నించిన అనంతరం మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జలను ప్రశ్నించామని వెల్లడించారు. ముందుగా సిద్ధం చేసుకున్న 38 ప్రశ్నలు అడిగామని తెలిపారు. సజ్జల తాము అడిగిన చాలా ప్రశ్నలకు గుర్తు లేదంటూ సమాధానమిచ్చారని సీఐ వివరించారు. 

గత ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా ఉన్నారు… మా వద్ద ఉన్న ఆధారాలతో ఆయనను ప్రశ్నించాం అని వెల్లడించారు. ఫోన్ అడిగినా సజ్జల ఇవ్వలేదని తెలిపారు. మొత్తమ్మీద విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి సహకరించలేదని సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 

తాము అడిగిన ప్రశ్నలకు వ్యతిరేక ధోరణిలో సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన రోజున తాను అక్కడ లేనని బదులిచ్చారని సీఐ వెల్లడించారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 

మూడు నెలులుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు దాదాపు చివరి దశకు వచ్చిందని అన్నారు. చాలామంది నిందితులు కోర్టుల ద్వారా రక్షణ పొందారని, దాంతో కేసు విచారణ వేగంగా జరగడంలేదని వివరించారు. నిందితులను అరెస్ట్ చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సీఐడీకి అప్పగించిందని, అధికారిక ఉత్తర్వులు రాగానే కేసు దర్యాప్తు ఫైళ్లను సీఐడీకి అప్పగిస్తామని వెల్లడించారు.

Related posts

ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా… ఎందుకంటే…!

Drukpadam

ముంబై- పూణె మ‌ధ్య అద్దాల‌ రైలు ప్ర‌యాణం!

Drukpadam

అత్యవసర ఫిర్యాదులకు ఇక డయల్ 112.. దేశవ్యాప్తంగా ఒకటే నంబర్

Drukpadam

Leave a Comment