మూసీ ప్రక్షాళనపై విషం ఎందుకు చిమ్ముతున్నారు …నేనేం అందాల భామల కోసం పని చేయడం లేదు: రేవంత్ రెడ్డి
మూసీ ప్రాజెక్టు వల్ల తనకేమీ ఆర్థిక ప్రయోజనం లేదన్న రేవంత్ రెడ్డి
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదు.. మూసీ ప్రక్షాళన అన్న ముఖ్యమంత్రి
మూసీ ప్రాజెక్టు అగ్రిమెంట్ విలువ రూ.141 కోట్లు అని స్పష్టీకరణ
మూసీ ప్రాజెక్టుపై విషం ఎందుకు చిమ్ముతున్నారని ఆగ్రహం
కేటీఆర్, హరీశ్ రావు ఈటల మూడు నెలలు అక్కడ ఉంటే ప్రాజెక్టు రద్దు చేస్తాం
ఆ నేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండాలన్న సీఎం
ఆ తర్వాత అక్కడి ప్రజల జీవితం బాగుందని చెప్పాలన్న రేవంత్ రెడ్డి
ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా పంపించాలని సూచన
మూసీ ప్రక్షాళనపై విషం ఎందుకు చిమ్ముతున్నారు … మూసీ ప్రాజెక్టు వల్ల తనకేమీ ఆర్థిక ప్రయోజనం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తానేమీ అందాల మేడలు… అందాల భామల కోసం పని చేయలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మూసీ ప్రాజెక్టు వల్ల తనకు ఏమైనా ఆర్థిక ప్రయోజనం ఉందా? అని ప్రశ్నించారు. ఆదాయాన్ని పెంచాలి… పేదలకు పంచాలనేదే తమ విధానం అన్నారు.
ఇందులో తనకు స్వార్థం లేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదని… ప్రక్షాళన అన్నారు. ఈ ప్రాజెక్టు వద్దంటే చెప్పాలని… వదిలేద్దామన్నారు. మూసీ విషం హైదరాబాద్ నగరాన్నే కాదు… నల్గొండనూ మింగుతోందన్నారు. నల్గొండ ప్రజలు ఈ అంశంపై మాట్లాడకుంటే ఎలా? అన్నారు. తనకేదో స్వార్థం ఉన్నట్లు తనను నిందిస్తున్నారని, కానీ తనను విమర్శించేది ఓ దోపిడీ దొంగ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు తనను తిడితే బాధపడనన్నారు.
మూసీ ప్రాజెక్టు అగ్రిమెంట్ విలువ రూ.141 కోట్లు
మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అని ఆరోపణలు చేస్తున్నారని… కానీ ఇది కేవలం రూ.141 కోట్ల అగ్రిమెంట్ అని స్పష్టం చేశారు. లక్షన్నర కోట్లు అని చెప్పి మింగేయడానికి ఇదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టా? అని ప్రశ్నించారు. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్నారు.
మూసీ ప్రాజెక్టుపై విషం ఎందుకు చిమ్ముతున్నారు?
గుజరాత్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం, హైదరాబాద్ సమతామూర్తి ప్రాజెక్టును చేపట్టింది మెయిన్‌హార్డ్స్ సంస్థనే అని తెలిపారు. అదే సంస్థ మూసీ ప్రాజెక్టు చేపడితే ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై విషం చిమ్మడం ఏమిటని మండిపడ్డారు. తాను కెప్టెన్ వంటి వాడినని… టీమ్ అంతా వద్దంటే తాను ఒక్కడిని ఎలా అడుతానని ప్రశ్నించారు. మీరంతా వద్దంటే తాను ఈ టెండర్ క్యాన్సిల్ చేయడానికి సిద్ధమని వెల్లడించారు.
వర్షం వస్తే చెన్నై, బెంగళూరు నగరాలను చూశారా?
మూసీ పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో నగరానికి ఇబ్బందులు వస్తాయన్నారు. వర్షం వస్తే చెన్నై, బెంగళూరు నగరాలు ఎలా అవుతున్నాయో ఇప్పటికే మనం చూశామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం, విజయవాడ మునిగిన విషయం గుర్తించాలన్నారు. వయనాడ్ పరిస్థితిని అందరం చూశామన్నారు.
జైలుకు పంపిస్తే తిండి వేస్ట్
నాగోల్ సుందరీకరణ పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. ఈ అంశంలో వారిని జైలుకు కూడా పంపించవచ్చునని… కానీ జైల్లో తిండి కూడా వేస్ట్ అన్నారు. మూసీ ప్రాజెక్టుపై చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. అధికారం కోల్పోయాక ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని విమర్శించారు.
అధికారం ముసుగులో దోచుకున్న బందిపోట్లు దొంగలు వీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌తో అధికారం వస్తుందని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి బందిపోటు దొంగలు మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతల ఉచ్చులో ప్రజలు పడవద్దని కోరారు.
నగరంలో బఫర్ జోన్‌లో పదివేల ఇళ్లు ఉన్నాయని, వారిని ఎలా ఆదుకోవాలనేదే తమ ఆలోచన అన్నారు. ఈ నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మూసీ విషయంలో మనం చరిత్రహీనులుగా మిగిలి పోకూడదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం మంచి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అందరి సహకారం ఉంటేనే మూసీ ప్రాజెక్టు విషయంలో ముందుకు సాగే అవకాశం ఉంటుందన్నారు.
మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నారు. మూసీ ప్రాజెక్టుపై తన తప్పును నిరూపించేందుకు విపక్ష నేతలకు ఇదే మంచి అవకాశమన్నారు. బుల్డోజర్లు తమ మీద నుంచి పోనీయాలని పోటీ పడటం కాదు… కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ మూసీ పరీవాహక ప్రాంతంలోనే మూడు నెలలు ఉండి… అక్కడి జీవితం బాగుందని చెప్పాలన్నారు. వాళ్లు అక్కడ ఉంటామని చెబితే అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వారు అక్కడ ఉంటే కనుక తాను వారి ఆరోపణలను ఖండించకుండా… ప్రాజెక్టును రద్దు చేస్తానని సవాల్ చేశారు. అవసరమైతే తన సొంత ఆస్తి అమ్మి ప్రభుత్వానికి నష్టం లేకుండా చేస్తానన్నారు.
అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా ఇవ్వండి
మూసీ ప్రక్షాళనపై ఏమైనా అనుమానాలు ఉంటే శనివారం లోగా తమకు పంపించాలని సూచించారు. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు తాను ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నానని… మూసీపై అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా పంపించాలన్నారు. సమాధానం చెప్పాకే ముందుకు వెళతామన్నారు.
రాడార్ వ్యవస్థపై స్పందించిన రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లాలో రాడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. దేశ భద్రతను రాజకీయాలతో ముడి పెట్టవద్దని సూచించారు. కొన్ని విషయాలను దేశభద్రత కోణంలో చూడాలని కోరారు. దేశభక్తి లేనివాడు కసబ్ కంటే హీనుడు అని మండిపడ్డారు. కేటీఆర్ కసబ్‌లా మారుతామంటే తమకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నారు.