జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి
మంత్రి దామోదర రాజనరసింహాతో టీయూడబ్ల్యూజే భేటీ
గత ఐదేళ్ల నుండి రాష్ట్రంలో జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (JHS) సక్రమంగా అమలుకాక పోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే అది అమలయ్యేలా పగడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహాను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ నె్తృత్వంలో ప్రతినిధి బృందం బంజారా హిల్స్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో, మంత్రి దామోదర రాజనర్సింహాను, రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్.వి.కర్ణన్ ను కలిసి జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలుపై చర్చింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు EJHS పథకాన్ని ప్రవేశపెట్టి, హెల్త్ కార్డులు జారీ చేయగా, ఆ పథకం 2019వరకు సక్రమంగా పనిచేసిందని విరాహత్ అలీ తెలిపారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ గత ఐదేళ్లుగా వైద్యం కోసం జర్నలిస్టులు కార్పొరేట్ ఆసుపత్రులకెళ్తే హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐదేళ్ల కాలంలో వివిధ ప్రమాదాలు, కరోనా కాటు, ఆయా వ్యాధులకు గురై రాష్ట్రంలో దాదాపు 300మంది జర్నలిస్టులు అకాలమరణానికి గురైనట్లు ఆయన తెలిపారు. పథకం అమలుకాక పోవడంతో పలువురు జర్నలిస్టులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య పథకాన్ని పునరుద్దరించి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రతా కల్పించాలని మంత్రి దామోదర రాజానరసింహాను కోరారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శులు వరకాల యాదగిరి, కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, హెల్త్ కమిటీ కన్వీనర్ ఏ.రాజేష్, HUJ అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.
త్వరలో ఉన్నత స్తాయి సమావేశం -మంత్రి దామోదర రాజనరసింహా
ఆరోగ్య పథకం విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలుచేసే విషయంలో త్వరలో శాఖా పరంగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తామని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి దామోదర రాజనరసింహా హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని ట్రస్ట్ ద్వారనైనా, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారనైనా నిర్వహించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో సమావేశమై, తదుపరి జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల బాధ్యులతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.