కేంద్ర పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి….. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
పాఠశాల హెడ్ మాస్టర్ పై విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలి
ఆసుపత్రి నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్ల పై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలి
ఖమ్మం జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహణ
జిల్లాలోని ప్రజలకు కేంద్ర ప్రాయోజిత పథకాల లబ్ది పొందేలా అధికారులు పని చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్ నాయక్ లతో కలిసి నిర్వహించారు.
దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే 3 నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు, తదితర అంశాలపై జిల్లా సంక్షేమ అధికారి, జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఈఈ హౌసింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఖమ్మం మున్సిపల్ కమిషనర్, జాతీయ రహదారులు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు వివరించారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ, బ్యాటరీ ఆథారిత వాహనాలను అవసరం, అర్హత ఉన్న దివ్యాంగులకు అందించేందుకు కేంద్ర అధికారులను ఫాలో అప్ చేస్తూ క్యాంపు నిర్వహణ కోసం కృషి చేయాలని, జిల్లా వ్యాప్తంగా అవసరమైన బ్యాటరీ ట్రై సైకిళ్లు నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు.
పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలపై గణాంకాలతో పక్కా నివేదిక తయారు చేయాలని అన్నారు. జిల్లాలో పత్తి పంట అధికంగా పండుతూ జిన్నింగ్ మిల్లులు లేని క్లస్టర్లను గుర్తించాలని, అక్కడ సిసిఐ ద్వారా జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపి అధికారులకు సూచించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు ప్రకారం సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ పై వేరే మండలాలకు చెందిన అధికారులతో విచారణ నిర్వహించి ఆ నివేదికను నేరుగా జిల్లా కలెక్టర్, ఎంపీకి అందజేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడే సిబ్బంది, అధికారులను ఉపేక్షించేది లేదని ఎంపీ తెలిపారు.
సత్తుపల్లిలో మంజూరైన ఆసుపత్రులలో సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై ఉన్నతాధికారులకు కలెక్టర్ ద్వారా నివేదిక సమర్పించాలని ఎంపీ సూచించారు. జిల్లాలో మంజూరైన జాతీయ రహదారుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి పెండింగ్ భూ సేకరణ పూర్తి చేసి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించాలని అన్నారు. జిల్లాలో చేపట్టే రోడ్డు మరుమ్మత్తు పనులు నాణ్యతతో పకడ్బందీగా చేపట్టాలని ఎంపీ సూచించారు.
అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఇసుకను సొంత అవసరాలకు ప్రజలు వాడుకునేందుకు గల అవకాశాలను పరిశీలించి అనుమతించాలని ఎంపీ అధికారులను కోరారు. యాసంగి నుంచి పంట బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. రైతుల తరఫున భీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ జిల్లా కలెక్టర్ కు సూచించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాలో నూతనంగా అవసరం ఉన్న అంగన్వాడి భవనాలు, మరమ్మత్తులకు గురైన భవనాల మొదలగు వివరాలను పార్లమెంట్ సభ్యులకు అందించాలని అన్నారు. సుగమ్య భారత్ అభియాన్ క్రింద దివ్యాంగుల కోసం ప్రజా సంచార ప్రదేశాలలో ప్రభుత్వం కల్పించిన ఇన్ ఫ్రా వివరాలను ఆడిట్ చేయాలని అన్నారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పాలు, ఇతర పోషకాహారం వినియోగం నాణ్యతను పరిశీలిస్తూ నివేదిక అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు.
జిల్లాలో 5 మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు క్రింద చిన్నారి కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో పిల్లల హెల్ప్ లైన్, డ్రగ్స్ వినియోగం, బాల్య వివాహాల నివారణ మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం చేపట్టామని అన్నారు.
జిల్లాలో పండే పంటల ఆధారంగా ఏర్పాటు చేయడానికి అవకాశం గల పరిశ్రమల స్టడీ నిర్వహించామని అన్నారు. ఎథనాల్ ఫ్యాక్టరీ, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లర్ల క్లస్టర్లు, పౌల్ట్రీ, కారం తయారీ కేంద్రం, మొదలగు పరిశ్రమల ఏర్పాటుకు మన జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ముద్రా రుణాలు, పిఎంఎఫ్ఎంఈ, ముద్రా రుణాలు మొదలగు అంశాలపై ప్రచారం కల్పిస్తూ, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసేలా చూడాలని, రుణాలు పొందేందుకు ఏ దరఖాస్తులు సమర్పించాలి, మొదలగు వివరాలను ఆసక్తి గల వారికి తెలియజేయాలని అన్నారు.
జిల్లాలోని విద్యాసంస్థలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. అక్రమ బియ్యం తరలింపు నివారణకు తీసుకుంటున్న చర్యలు మరింత ఎన్ ఫోర్స్ మెంట్ ఉండాలని అన్నారు. ప్రస్తుతం సన్న రకం ధాన్యం 500 రూపాయలు క్వింటాల్ బోనస్ అందిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
సన్న రకం బోనస్ లో అవకతవకలను అరికట్టేందుకు ధాన్యం నాణ్యతతో పాటు సన్న రకం ధాన్యం రైతు ఆ గ్రామంలో పండించారని, ఇంత దిగుమతి వచ్చిందని వ్యవసాయ విస్తరణ అధికారులు ధృవీకరించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో కూడా సదరం క్యాంప్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో మొత్తం లక్షా 50 వేల పైగా వివిధ రకాల పెన్షన్లు అందుతున్నాయని, మరో 15 వేల వరకు పెన్షన్లు జారీ చేయాల్సి ఉంటుందని, ఇందులో డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారని, ప్రభుత్వం నుంచి నూతన పెన్షన్ మంజూరు కొరకు ఆదేశాలు వచ్చిన వెంటనే నూతన పెన్షన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఇండ్లు లేని ప్రజలు ఎంతమంది ఉన్నారు, అందులో నిరుపేదలు ఎంతమంది మొదలగు ప్రాథమిక సర్వే నిర్వహించామని కలెక్టర్ వివరించారు. జిల్లాలోలబ్ధిదారులకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అప్రోచ్ రోడ్, ఇతర మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
నూతన డీఎస్సీతో మన జిల్లాలో 500 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చారని అన్నారు. ఉపాధ్యాయుల కొరత లేనందున పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో కనీస మౌళిక వస్తువులు కల్పించామని అన్నారు. పాఠశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నామని అన్నారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనలను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించడానికి వీలు లేదని , సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని నివేదికను సత్తుపల్లి ఎమ్మెల్యేకు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్ల నాణ్యతను తనిఖీ చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి పాలు, ఆయిల్ దుర్వినియోగం అవుతున్నాయని అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు.
చిన్న, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందేంచే సబ్సిడీలు, రుణాలు మొదలగు అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. పిఎంఎఫ్ఎంఈ ద్వారా గిరిజనులను పారిశ్రామికవేత్త తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశం గురించి తెలియజేస్తూ ఆసక్తి గలవారు అంది పుచ్చుకునేలా చూడాలని అన్నారు.
మిల్లుల దగ్గర ధాన్యం నాణ్యతపై ఎటువంటి కొర్రిలు జరగకుండా చూడాలని, రైతులకు ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ఖమ్మం జిల్లా కేంద్రానికి రావాల్సి ఉందని, ఇది దివ్యాంగులకు చాలా ఇబ్బందిగా ఉందని, నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌళిక వసతుల కల్పన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెడ్ మాస్టర్ కు అనుకూలంగా రిపోర్ట్ తయారు చేసి, సస్పెన్షన్ కు గురైన హెడ్మాస్టర్ ను అదే పాఠశాలలో ఎలా పోస్టింగ్ ఇచ్చారని, ఫిర్యాదు చేసిన తన అభిప్రాయం అడగకుండా విచారణ రిపోర్టు ఎలా రూపొందించారని అన్నారు. అదే హెడ్ మాస్టర్ నేడు పిల్లలతో సొంత పనులు చేయిస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు అన్నారు.
సత్తుపల్లిలో మంజూరు చేసిన ఆసుపత్రి నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయి మొదలగు వివరాలను ఆరా తీశారు. పనులు పూర్తి చేయడంలో ఆలస్యంచేస్తున్న కాంట్రాక్టర్ కు నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ఎలా అప్పగించారని, సింగల్ టెండర్ ఎలా అనుమతి ఇస్తున్నారని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. రోడ్డు మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. సత్తుపల్లి నుంచి కొవ్వూరు దారి మధ్యలో రైల్వే లైన్ దగ్గర ఆర్.ఓ.బి లేదా అండర్ బ్రిడ్జి మంజూరు చేయాలని కోరారు.
సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా బ్రిడ్జి మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అక్కడ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఇది అత్యంత ప్రాధాన్యతగా భావించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
గత 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇండ్లు మంజూరు కాలేదని, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇసుక తరలింపు అవకాశం కల్పించాలని అన్నారు.
స్టీల్ ప్లాంట్ రైల్వే లైన్, ఖమ్మం ఇల్లందు దారిలో రైల్వే లైన్ ఉందని, ఇక్కడ ఆర్.ఓ.బి. లేదా అండర్ బ్రిడ్జి మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాల్లో గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు మాత్రమే ఉన్నాయని, నూతన విద్యుత్ స్తంభాలు అవసరమున్న చోట వేయాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య,శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డి.ఎఫ్.ఓ. సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.