- మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో షాకింగ్ ఘటన
- విహారయాత్రకు వెళ్లిన వ్యక్తులకు కంటబడ్డ చిరుత
- చిరుతను ఆటపట్టించడంతో వ్యక్తులపై దాడి
- తప్పించుకునే క్రమంలో ముగ్గురికి గాయాలు
- ఘటన తాలూకు వీడియో నెట్టింట హల్‌చల్
మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కొందరు వ్యక్తులు సౌత్ ఫారెస్ట్ డివిజన్ రేంజ్‌లో విహారయాత్రకు వెళ్లారు. అలా వారు తమ పిక్నిక్‌ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో వారికి పొదల మాటున ఒక చిరుత పులి కనిపించింది. అంతే.. కొందరు దాంతో పరాచకాలు మొదలెట్టారు.
రా.. రా.. అంటు ఆటపట్టించారు. మీరు అంతగా పిలిస్తే నేను రాలేనా.. అన్నట్టుగా ఒక్కసారిగా చిరుత ఆ గుంపువైపు పరిగెత్తుకు వచ్చింది. ఇంకేముంది.. చిరుత అలా తమవైపు పరుగులు పెట్టడం చూసిన గుంపు అక్కడి నుంచి పరిగెత్తడం మొదలెట్టింది. కానీ, చిరుత పరుగు ముందు వారెంత? అందుకే, ముగ్గురిని గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
చిరుతపులి ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి, మరో వ్యక్తిని నేలపైకి లాగి, అతనిని చీల్చడానికి ప్రయత్నించడం వీడియోలో ఉంది. ఈ ఘటన షాడోల్ శ్రేణిలోని ఖితౌలీ బీట్‌లోని సోన్ నదికి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇదే మాదిరి పులి దాడికి సంబంధించిన ఒక సంఘటన జరిగినట్లు షాహదోల్ సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ బాద్షా రావత్ తెలిపారు. అందుకే అడవుల్లోకి ప్రజలు వెళ్లకుండా నిషేధించినట్లు చెప్పారు. ప్రజలకు సహాయపడటానికి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.