- నైరోబీలో జింబాబ్వే, గాంబియా టీ20 మ్యాచ్
- నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 రన్స్ చేసిన జింబాబ్వే
- గాంబియా 54 పరుగులకే ఆలౌట్
- 290 పరుగుల తేడాతో జింబాబ్వే భారీ విజయం
- అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద విజయం
- టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ (33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా రజా
టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే స్వైరవిహారం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డు సృష్టించింది.
అలాగే జింబాబ్వే గతేడాది హాంగ్‌జౌలో మంగోలియాపై నేపాల్ నెలకొల్పిన 314-3 అంతర్జాతీయ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. జింబాబ్వే జట్టు కెప్టెన్ సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ బాదడం విశేషం. ఇది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండవ ఫాస్టెస్ట్ శతకం.
నమీబియాకు చెందిన జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్‌తో సమంగా నిలిచాడు. ఈ ఏడాది జూన్‌లో సైప్రస్‌పై ఎస్టోనియా తరఫున సాహిల్ చౌహాన్ చేసిన 27 బంతుల్లో సెంచరీ ఇప్పటివరకు ఫాస్టెస్ట్ శతకం.
ఇక 345 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన గాంబియాను జింబాబ్వే 14.4 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌట్ చేసింది. తద్వారా 290 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇది అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు అతిపెద్ద విజయం.
రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన సికందర్ రజా
ఈ మ్యాచ్ ద్వారా జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించాడు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ (33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో 35 బంతుల్లో శతకం కొట్టిన రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్‌ల రికార్డును బద్దలు కొట్టాడు.