- జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో తెరపైకి సరస్వతి పవర్ సంస్థ పేరు
- ఈ సంస్థకు చెందిన భూముల్లో అటవీ భూములు ఉన్నాయని కథనాలు
- సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు
- కదిలిన అధికార యంత్రాంగం
జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ సంస్థకు చెందిన 1,515 ఎకరాల భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి.
దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించి, సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత మేర అటవీ భూములు ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పవన్ ఆదేశాల నేపథ్యంలో, నేడు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
సర్వే అనంతరం అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి మంత్రి పవన్ కల్యాణ్ కు సమర్పించనున్నారు.