Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

ఘోరంగా ఓడిన టీమిండియా… చరిత్ర సృష్టించిన కివీస్ జట్టు!

  • రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ దే విజయం
  • 2-0తో సిరీస్ నెగ్గిన కివీస్
  • 359 పరుగుల ఛేదనలో 245 పరుగులకే టీమిండియా ఆలౌట్
  • 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓడిన టీమిండియా

సొంతగడ్డపై పులి అని పేరు తెచ్చుకున్న టీమిండియాకు దారుణ భంగపాటు ఎదురైంది. న్యూజిలాండ్ తో రెండో టెస్టులోనూ రోహిత్ సేనకు ఘోర పరాజయం తప్పలేదు. 

పుణేలో మూడ్రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టు మ్యాచ్ లో కివీస్ 113 పరుగుల భారీ తేడాతో నెగ్గి… మూడు టెస్టుల సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. తద్వారా భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. 

ఇక, భారత్ తన సొంతగడ్డపై ఓ టెస్టు సిరీస్ ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. 2012-13 సీజన్ లో భారత్ లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టు 4 టెస్టుల సిరీస్ ను 2-1తో నెగ్గింది. ఆ తర్వాత ఇన్నాళ్లకు టీమిండియా మళ్లీ ఓడింది. 

ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ లో 2-0తో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ ఈస్థాయిలో ఆడుతుందని ఎవరూ అనుకోలేదు. శ్రీలంక పర్యటనలో కివీస్ కు కెప్టెన్ గా వ్యవహరించిన టిమ్ సౌథీ పదవి నుంచి తప్పుకోగా… భారత్ లో పర్యటనకు టామ్ లాథమ్ కెప్టెన్ అయ్యాడు. లాథమ్ నాయకత్వంలోని న్యూజిలాండర్లు అన్ని రంగాల్లోనూ భారత్ ను గట్టి దెబ్బకొట్టి సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం. 

తొలి టెస్టు బెంగళూరులో జరగ్గా… న్యూజిలాండ్ పేస్ కు టీమిండియా బ్యాటింగ్ లైనప్ దాసోహం అంది. రెండో టెస్టులో స్పిన్ పిచ్ ఉంటుందని ముందే అంచనా వేయగా… ఇది టీమిండియాకు కలిసొచ్చే అంశమని అందరూ అనుకున్నారు. కానీ, కివీస్ పుణేలో  స్పిన్ అస్త్రంతోనే టీమిండియాను కుప్పకూల్చడం గమనార్హం. 

ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ 259 పరుగులు చేయగా… భారత్ 156 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ టీమ్ 255 పరుగులు చేసి, టీమిండియా ముందు 359 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 

అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 245 వద్ద తన పోరాటాన్ని ముగించింది. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లతో సత్తా చాటిన కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్… రెండో ఇన్నింగ్స్ లోనూ 6 వికెట్లతో టీమిండియా వెన్నువిరిచాడు. మరో స్పిన్నర్ అజాజ్ పటేల్ కు 2, పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ కు 1 వికెట్ దక్కాయి.

ఇక, ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబరు 1 నుంచి ముంబయిలో జరగనుంది. సిరీస్ ఫలితం తేలిన నేపథ్యంలో, చివరిదైన ఈ మూడో టెస్టు నామమాత్రంగా మారిపోయింది.

Related posts

‘భార‌త క్రికెట‌ర్‌గా ఇదే నా చివ‌రి రోజు’.. రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ అశ్విన్ భావోద్వేగం!

Ram Narayana

మూడో టీ20లో టీమిండియాదే విజయం… సిరీస్ లో ముందంజ

Ram Narayana

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డు…

Ram Narayana

Leave a Comment