Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

భారత మహిళల జట్టుకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా!

  • తొలిసారి మహిళల ప్రపంచకప్‌ను గెలిచిన భారత క్రికెట్ జట్టు
  • ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఉమెన్ ఇన్ బ్లూ
  • విజేతలకు రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ
  • 1983 కపిల్ దేవ్ విజయాన్ని గుర్తు చేసిందన్న ఐపీఎల్ ఛైర్మన్
  • ఎల్లుండి ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా అమ్మాయిలు!
  • ఇది చరిత్రాత్మక క్షణం.. జట్టును చూసి గర్వపడుతున్నా: కోచ్ అమోల్ ముజుందార్

భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

ఈ గెలుపును పురస్కరించుకుని క్రీడాకారిణులు, సహాయక సిబ్బందికి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఇది భారత మహిళల క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే చారిత్రక విజయమని ఆయన కొనియాడారు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందిస్తూ, “1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని పురుషుల జట్టు సాధించిన విజయాన్ని భారత మహిళలు పునరావృతం చేశారు. ఈ గెలుపు దేశంలో మహిళల క్రికెట్‌కు నూత‌న ఉత్తేజాన్ని ఇస్తుంది” అని ప్రశంసించారు.

ఎల్లుండి ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా అమ్మాయిలు!

Indian Womens Cricket Team World Cup Victory Meet with PM Modi

మహిళల వన్డే ప్రపంచకప్‌లో చారిత్రక విజయం సాధించి, తొలిసారి కప్పును ముద్దాడిన భారత జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఐసీసీ మెగా టోర్నీ విజేతలుగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన బుధవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది.

ప్రస్తుతం నవీ ముంబైలో ఉన్న క్రీడాకారిణులు, సహాయక సిబ్బంది మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం వారు తమ స్వస్థలాలకు వెళతారు. జట్టుకు ప్రకటించిన రూ. 51 కోట్ల నగదు బహుమతిని క్రీడాకారులు, సహాయక సిబ్బంది, ఐదుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది చరిత్రాత్మక క్షణం.. జట్టును చూసి గర్వపడుతున్నా: కోచ్ అమోల్ ముజుందార్

Amol Muzumdar Hails India Womens Cricket Team Historic World Cup Victory

ఈ చారిత్రక విజయం అనంతరం హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇది భారత క్రికెట్‌లో ఒక కీలక మలుపు అని, దేశ క్రీడా భవిష్యత్తును ఇది పునర్నిర్వచిస్తుందని ఆయన అభివర్ణించారు.

విజయం ఖరారైన క్షణంలో ఆనందబాష్పాలతో కనిపించిన ముజుందార్… “నాకు మాటలు రావడం లేదు. జట్టును చూసి చాలా గర్వంగా ఉంది. వారి కఠోర శ్రమ, అచంచలమైన విశ్వాసానికి ఈ విజయం సంపూర్ణంగా అర్హమైనది. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు” అని అన్నారు. 2023లో జట్టు బాధ్యతలు చేపట్టిన ముజుందార్, టోర్నమెంట్ ఆసాంతం జట్టు ప్రదర్శించిన పట్టుదలను, ఐక్యతను కొనియాడారు.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత విజయం సమష్టి ప్రదర్శన ఫలితమే అయినా, 21 ఏళ్ల యువ కెరటం షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. బ్యాటింగ్‌లో 87 పరుగులతో చెలరేగిన ఆమె, బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. షఫాలీ గురించి ముజుందార్ మాట్లాడుతూ.. “ఆమె ప్రదర్శన అద్భుతం. సెమీస్, ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లలో, ఇంత ఒత్తిడిలోనూ ఆమె ప్రతిసారీ రాణిస్తుంది. పరుగులు, వికెట్లు, క్యాచ్‌లు.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించింది” అని ప్రశంసించారు.

భారత్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 246 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. డెత్ ఓవర్లలో శ్రీ చరణి సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌పై తాము ప్రత్యేకంగా దృష్టి సారించామని, మైదానంలో కనబరిచిన చురుకుదనం దాని ఫలితమేనని ముజుందార్ వివరించారు.

భారత క్రికెట్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరున్నా దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోయిన అమోల్ ముజుందార్‌కు ఈ విజయం వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం. “ఇది ఒక చరిత్రాత్మక క్షణం. దీని ప్రభావం రాబోయే తరాలపై తప్పక ఉంటుంది” అని ఆయన అన్నారు. 

సమాన వేతనం తెచ్చిన ప్రపంచకప్.. భారత అమ్మాయిల విజయం వెనుక కథ!

Harmanpreet Kaur Leads India to World Cup Victory with Equal Pay

మూడేళ్ల క్రితం, అక్టోబర్ 2022లో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన 15వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఒక చారిత్రక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. పురుషులు, మహిళా క్రికెటర్ల మధ్య ‘పే ప్యారిటీ’ (సమాన వేతనం) విధానాన్ని ప్రవేశపెట్టింది. పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారుణులకు కూడా మ్యాచ్ ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఆ సమయంలో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహిళల క్రికెట్‌కు అంత ఆదాయం, ప్రేక్షకాదరణ లేనప్పుడు సమాన వేతనం ఇవ్వడం ఆర్థికంగా సరికాదని కొందరు విమర్శించారు.

లీగ్ దశల్లో జట్టు కొన్ని ఓటములు ఎదుర్కొన్నప్పుడు ఈ విమర్శలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తూ, కనీసం సమాన వేతనం పొందే అర్హత కూడా ఈ జట్టుకు ఉందా? అని ప్రశ్నించారు. అయితే, ఈ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ… భారత అమ్మాయిలు ట్రోఫీని గెలిచి తమపై బీసీసీఐ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టారు.

ఈ చారిత్రక విజయం తర్వాత బీసీసీఐ కార్యదర్శి జై షా తన ట్వీట్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. “భారత మహిళల జట్టు ప్రపంచకప్ గెలవడం అద్భుతం. క్రీడాకారుల నైపుణ్యం, పట్టుదలతో పాటు బీసీసీఐ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించాయి. పెరిగిన పెట్టుబడులు, పురుషులతో సమాన వేతనం, మెరుగైన కోచింగ్ సిబ్బంది, డబ్ల్యూపీఎల్ ద్వారా వచ్చిన అనుభవం ఈ విజయానికి పునాది వేశాయి” అని వివరించారు.

మహిళల ప్రపంచకప్‌లో భారత్ చారిత్రక విజయం.. అభినందించిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల

Sundar Pichai Satya Nadella Praise India Womens Cricket World Cup Victory

ఈ చారిత్రక విజయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుండగా, టెక్ దిగ్గజాలు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత జట్టును ప్రత్యేకంగా అభినందించారు.

ఈ విజయంపై ఎక్స్ (ట్విట్ట‌ర్‌)లో స్పందించిన సుందర్ పిచాయ్.. ఇది 1983, 2011 నాటి పురుషుల ప్రపంచకప్ విజయాలను గుర్తు చేసిందని అన్నారు. “నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఫైనల్ ఇది. టీమిండియాకు అభినందనలు. ఈ విజయం రాబోయే తరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా కూడా అద్భుతంగా ఆడింది” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భారత జట్టును కొనియాడారు. “ఉమెన్ ఇన్ బ్లూ- ప్రపంచ ఛాంపియన్స్! మహిళల క్రికెట్‌లో ఇది నిజంగా ఒక చారిత్రక రోజు. కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. అడ్డంకులు తొలగిపోయాయి, కొత్త లెజెండ్స్ పుట్టుకొచ్చారు” అంటూ ప్రశంసించారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఇద్దరు టెక్ లీడర్ల నుంచి వచ్చిన ఈ అభినందనలు, ఈ విజయం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

భారత జట్టు విజయంపై గౌతమ్ అదానీ ప్రశంసలు…

Gautam Adani Praises India Womens Cricket Team World Cup Victory

ఈ చారిత్రక విజయంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఇది కేవలం క్రికెట్‌లో సాధించిన విజయం కాదని, ఇది స్ఫూర్తికి, లక్షలాది మంది అమ్మాయిల కలలకు దక్కిన గెలుపని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు. “భారత్‌కు, ఆమె కుమార్తెలకు అద్భుతమైన విజయం! ఇది కేవలం క్రికెట్ విజయం కాదు. ఇది స్ఫూర్తి, ప్రతిభ, కలలు కనే ప్రతి అమ్మాయి విజయం” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

దీంతో పాటు జట్టు పోరాట స్ఫూర్తిని ప్రశంసిస్తూ దేశభక్తితో కూడిన ఓ కవితను కూడా ఆయన పంచుకున్నారు. “హర్ గేంద్ పే జోష్, హర్ షాట్ మే జాన్, యహ్ హై హమారీ టీమ్ ఇండియా (ప్రతి బంతిలో ఉత్సాహం, ప్రతి షాట్‌లో ప్రాణం.. ఇదే మా టీమిండియా). భయంలేని, ధైర్యవంతులైన మన భారత జట్టును చూసి గర్విస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

ప్రపంచకప్ వేదికపై భావోద్వేగం.. జై షా కాళ్లకు నమస్కరించబోయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్!

Harmanpreet Kaur Almost Touches Jai Shahs Feet After World Cup Win

టోర్నమెంట్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములు ఎదురవడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వ పటిమపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ నాకౌట్ దశలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో, వ్యూహాత్మక కెప్టెన్సీతో ఆమె సమాధానం చెప్పింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. మహిళల క్రికెట్‌లో బీసీసీఐ కార్యదర్శిగా జై షా చేసిన సంస్కరణలు, ముఖ్యంగా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు చేయడం వంటి నిర్ణయాల పట్ల కృతజ్ఞతతోనే హర్మన్‌ప్రీత్ ఆయన కాళ్లకు నమస్కరించే ప్రయత్నం చేసింది.

మ్యాచ్ అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ “లీగ్ దశలో ఇంగ్లండ్‌తో జరిగిన ఓటమి మాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రి తర్వాత మేమంతా దృఢ సంకల్పంతో బరిలోకి దిగాం. విజువలైజేషన్, మెడిటేషన్ వంటివి సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాం. ఇది జట్టులో ప్రతి ఒక్కరిపై సానుకూల ప్రభావం చూపింది. మేమంతా ఒక లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చామని, ఈసారి కప్ గెలవాల్సిందేనని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.

ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నామని, రాత్రంతా సంబరాలు జరుపుకుంటామని ఆమె ఆనందంగా చెప్పింది. “ఇది ఆరంభం మాత్రమే, మా ప్రయాణం ఇక్కడితో ఆగదు” అంటూ భవిష్యత్ విజయాలపై ధీమా వ్యక్తం చేసింది.

మహిళల విక్టరీ పరేడ్‌కు బ్రేక్.. అసలు కారణం ఇదే!

Indian Womens Cricket Team Victory Parade Delayed BCCI Clarifies

భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని విక్టరీ పరేడ్ నిర్వహించే విషయమై ఇంకా ఎలాంటి ప్రణాళిక ఖరారు కాలేదని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా సోమవారం ఐఏఎన్‌ఎస్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

నవంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ సమావేశాల దృష్ట్యా బోర్డులోని కీలక అధికారులు ప్రయాణాల్లో ఉన్నారని, వారు తిరిగి వచ్చిన తర్వాతే విజయోత్సవాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. “ప్రస్తుతానికి విక్టరీ పరేడ్ వంటి ప్రణాళికలేవీ లేవు. నేను ఐసీసీ సమావేశాల కోసం దుబాయ్ వెళుతున్నాను. చాలా మంది అధికారులు కూడా అక్కడికి వస్తున్నారు. మేమంతా తిరిగి వచ్చాక తగిన ప్రణాళిక రచిస్తాం” అని ముంబై విమానాశ్రయం నుంచి సైకియా వివరించారు.

ఇదే సమయంలో పురుషుల ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదాన్ని కూడా ఐసీసీ దృష్టికి తీసుకెళ‌తామని సైకియా స్పష్టం చేశారు. “ఆసియా కప్ ట్రోఫీ విషయాన్ని ఐసీసీ వద్ద ప్రస్తావిస్తాం. మా ట్రోఫీకి దక్కాల్సిన గౌరవంతో దాన్ని తిరిగి పొందుతామని ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ ఆసియా కప్ వివాదం?
సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రోఫీ, పతకాలు లేకుండానే భారత ఆటగాళ్లు విజయాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. ఈ సమస్య పరిష్కారం కోసం బీసీసీఐ ఇప్పటికే ఏసీసీకి లేఖ రాసినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఇప్పుడు ఐసీసీ జోక్యాన్ని కోరుతోంది.

సచిన్‌తో మాట్లాడిన తర్వాత కొత్త ఉత్సాహం వచ్చింది: వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించిన షెఫాలీ వర్మ

Shefali Verma Inspired After Talking With Sachin Tendulkar

ఫైనల్ మ్యాచ్‌కు ముందు సచిన్ టెండుల్కర్‌తో మాట్లాడానని, ఆయనతో మాట్లాడిన తర్వాత తనకు తెలియని కొత్త ఉత్సాహం వచ్చిందని ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన ఓపెనర్ షెఫాలీ వర్మ వెల్లడించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. వందకు పైగా స్ట్రైక్ రేటుతో 87 పరుగులు చేసి బ్యాటింగ్‌లో రాణించింది. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీసి ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

కప్ గెలిచిన అనంతరం ఆమె మాట్లాడుతూ, మ్యాచ్‌కు కొన్ని క్షణాల ముందు సచిన్‌తో తాను మాట్లాడిన మాటలతో అంతా మారిపోయిందని తెలిపింది. టెండుల్కర్‌ను చూడగానే తనకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చిందని, ఆయన తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొంది. మాస్టర్‌ను చూస్తే స్ఫూర్తి కలుగుతుందని తెలిపింది. ఈ విజయం ద్వారా కలిగిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని ఆమె ఆనందం వ్యక్తం చేసింది.

ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలమని తనకు అర్థమైందని, ఎలాంటి గందరగోళం లేకుండా ఆటపై మాత్రమే దృష్టి సారించానని ఆమె తెలిపింది. జట్టులోని ప్రతి ఒక్కరు తనను ప్రోత్సహించారని వెల్లడించింది. ఏమీ ఆలోచించకుండా తన ఆట తాను ఆడుకోవాలని చెప్పారని గుర్తు చేసుకున్నది. మ్యాచ్‌కు ముందు సచిన్ సర్‌ను చూడగానే తాను ప్రత్యేకంగా ఏదైనా సాధించగలననే నమ్మకం కలిగిందని ధీమా వ్యక్తం చేసింది.

ఢిల్లీ క్రికెటర్ ప్రతీక్ రావల్ గాయపడటంతో హర్యానాకు 21 ఏళ్ల చెందిన షెఫాలీ వర్మ అనూహ్యంగా జట్టులోకి వచ్చింది. సెమీస్‌లో అంతగా రాణించలేదు. ఫైనల్‌లో మాత్రం బ్యాట్, బంతితో అద్భుతం చేసింది.

 టీమిండియా మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు రూ.1 కోటి నజరానా

Kranti Gaud Awarded 1 Crore for World Cup Performance

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులోని కీలక సభ్యురాలికి భారీ నజరానా లభించింది. ఈ మెగా టోర్నీలో తన అద్భుత బౌలింగ్‌తో రాణించిన మధ్యప్రదేశ్‌కు చెందిన యువ పేసర్ క్రాంతి గౌడ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోమవారం స్వయంగా వెల్లడించారు.

ఈ విజయం అనంతరం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ, “నిన్న రాత్రి మన అమ్మాయిలు క్రికెట్‌లో అద్భుతాలు చేశారు. యావత్ దేశం గర్వపడేలా చేశారు. ఈ విజేత జట్టులో మన మధ్యప్రదేశ్ బిడ్డ క్రాంతి గౌడ్ కూడా ఉండటం మాకు గర్వకారణం. ఆమె అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.1 కోటి బహుమతిని ప్రకటిస్తున్నాను” అని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నట్లే, మహిళలు కూడా క్రీడల్లో సత్తా చాటుతున్నారని ఆయన కొనియాడారు.

బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని చతర్‌పూర్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె తండ్రి ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రికెట్‌పై మక్కువతో కఠోర సాధన చేసింది. చిన్నప్పుడు అబ్బాయిలతో కలిసి టెన్నిస్ బంతితో ఆడి, ఆ తర్వాత లెదర్ బాల్ క్రికెట్‌లో రాటుదేలింది. రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌గా మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2025లో శ్రీలంకతో జరిగిన ట్రై-సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆమె, ఇంగ్లండ్ పర్యటనలో 52 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌లో ఆమె ప్రదర్శన భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది.

ఆఖరి నిమిషంలో వచ్చి… వరల్డ్ కప్ అందించి… దేవుడి ప్లాన్ అంటే ఇదే!

Shafali Verma World Cup Win Gods Plan

ఈ విజయంలో యువ సంచలనం షఫాలీ వర్మ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. గాయపడిన మరో క్రీడాకారిణి స్థానంలో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి, 87 పరుగులతో పాటు రెండు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ అద్భుత ప్రదర్శన, తనకు లభించిన అవకాశం అంతా దేవుడి ప్రణాళికలో భాగమేనని షఫాలీ భావోద్వేగంగా చెప్పింది.

జియోస్టార్‌తో మాట్లాడుతూ.. “సెమీఫైనల్‌కు ముందు నాకు జట్టు నుంచి ఫోన్ వచ్చినప్పుడు, నేను నిజంగా ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను. చివరి నిమిషంలో ఇలాంటి అవకాశం రావడం అరుదు. ఎలాంటి ఒత్తిడి లేకుండా నా ఆటను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం ఒక కల నిజమైనట్లు అనిపించింది. ఇదంతా దేవుడి ప్లాన్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను” అని షఫాలీ తెలిపింది.

జట్టులోని వాతావరణం, కెప్టెన్, కోచ్ ఇచ్చిన మద్దతు వల్లే తాను ఇంత స్వేచ్ఛగా ఆడగలిగానని ఆమె పేర్కొంది. “నేను జట్టుతో కలిసిన రోజు నుంచి అందరూ నన్ను ఆదరించారు. హెడ్ కోచ్ అమోల్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. భయం లేకుండా నీ సహజమైన ఆట ఆడు, తప్పుల గురించి ఆలోచించవద్దు అని చెప్పారు. ఆ స్వేచ్ఛే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది” అని వివరించింది.

వాస్తవానికి, తొలుత ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో షఫాలీకి చోటు దక్కలేదు. ఆ నిరాశ గురించి మాట్లాడుతూ, “మొదట నన్ను ఎంపిక చేయనప్పుడు చాలా బాధపడ్డాను. కానీ నా ఫిట్‌నెస్‌పై మరింత కష్టపడాలని నిర్ణయించుకున్నాను. నా సహచర క్రీడాకారులు ‘నువ్వు తిరిగి వస్తావు, సిద్ధంగా ఉండు’ అని చెబుతూనే ఉన్నారు. వారి నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు వరల్డ్ కప్ విజేతగా ఇక్కడ నిలబడటం నమ్మశక్యంగా లేదు” అని చెప్పింది.

ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో గెలవడమే తమ ప్రయాణంలో కీలక మలుపు అని షఫాలీ అభిప్రాయపడింది. “సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం మాలో భారీ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ విజయంతో మేము కప్ గెలవగలమని నమ్మాము. ఫైనల్లో ప్రతి ఒక్కరూ తమ సర్వస్వాన్ని పణంగా పెట్టారు” అని తెలిపింది.

షఫాలీ ప్రదర్శనపై మరో క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “కొన్ని సంఘటనలు జరగాలని రాసిపెట్టి ఉంటుంది. షఫాలీ చివరి నిమిషంలో జట్టులోకి రావడం అలాంటిదే. ఆమె లేకుండా మేము ఇది సాధించలేకపోయేవాళ్లం. ఈ జట్టులో ఒకరికొకరు అండగా నిలబడటమే మా అసలైన బలం” అని వివరించింది.

మహిళా పేసర్ రేణుకా ఠాకూర్ కు రూ.1 కోటి నజరానా ప్రకటించిన సీఎం సుఖు

Renuka Thakur gets Rs 1 crore reward from CM Sukhu

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలిచిన చారిత్రక సందర్భంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పేసర్ రేణుక ఠాకూర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రేణుకకు కోటి రూపాయల బహుమతి అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సోమవారం వెల్లడించారు. సిమ్లా జిల్లాలోని రోహ్రు ప్రాంతానికి చెందిన రేణుక, భారత జట్టులో కీలక సభ్యురాలిగా రాణించింది.

ఈ సందర్భంగా సీఎం సుఖు, రేణుక ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టు సభ్యులందరికీ తన అభినందనలు తెలిపారు. తాను సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లను చూశానని, భారత జట్టు అద్భుతంగా ఆడిందని ప్రశంసించారు. రేణుక ప్రదర్శన రాష్ట్రానికే గర్వకారణమని, ఎంతో మంది యువతులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కూతురు సాధించిన విజయంపై రేణుక తల్లి సునీత ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “రేణుక లాంటి కూతురు అందరికీ ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. “తమ ఆడపిల్లలు ముందుకు వెళ్లాలనుకుంటే తల్లిదండ్రులు అడ్డుకోవద్దు. వారిని ప్రోత్సహించండి, వారిని ప్రకాశించనివ్వండి” అని ఆమె మీడియాకు తెలిపారు. చిన్నప్పుడు రేణుక స్థానిక మైదానంలో గుడ్డతో చేసిన బంతి, చెక్క బ్యాట్‌తో ఆడేదని ఆమె గుర్తుచేసుకున్నారు.

“నా సోదరిని చూసి గర్వపడుతున్నాను. ఆమె బౌలింగ్, వికెట్లు తీసిన తీరు అద్భుతం. మేము ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాం” అని రేణుక సోదరుడు వినోద్ ఠాకూర్ అన్నారు.

రోహ్రు సబ్-డివిజన్‌లోని పార్సా అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన రేణుక ఠాకూర్, అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశారు. ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ – 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు తొలిసారిగా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇది తరతరాలు గుర్తుండిపోయే విజయం: గవాస్కర్

Sunil Gavaskar Hails India Womens World Cup Victory As Historic

భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ విజయం భారత క్రికెట్ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది యుగయుగాల పాటు గుర్తుండిపోతుందని అభిప్రాయపడ్డాడు. భారత అమ్మాయిలు అందించిన ఈ అద్భుత విజయం దేశానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కొనియాడాడు.

ఈ చారిత్రాత్మక విజయంపై సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గవాస్కర్ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. “నిన్న డీవై పాటిల్ స్టేడియంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టి జట్టును విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఎంత అద్భుతంగా ఉంది. అదొక అపురూపమైన ఘట్టం. ఎంతో గొప్ప మూమెంట్” అని ఆనందం వ్యక్తం చేశాడు.

లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో కష్టాల్లో పడిన భారత జట్టు, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని నాకౌట్ దశలో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు చేరింది. ఈ పోరాట స్ఫూర్తిని గవాస్కర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. “భారత అమ్మాయిలు పోరాడిన తీరు అద్భుతం. క్లిష్ట పరిస్థితుల నుంచి వారు గొప్పగా పుంజుకున్నారు. కెప్టెన్ గొప్ప నాయకత్వ పటిమను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి ప్రపంచకప్ గెలిచింది. ఇది ఆస్వాదించాల్సిన, చిరకాలం గుర్తుంచుకోవాల్సిన విజయం” అని తెలిపాడు.

ఈ విజయం కేవలం మహిళల క్రికెట్‌కే కాకుండా, మొత్తం భారత క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని గవాస్కర్ అభివర్ణించాడు. “భారత క్రికెట్ చరిత్రలో ఇది ఒక అద్భుతమైన ఘట్టం. మాకు ఇంతటి సంతోషాన్ని, ఆనందాన్ని అందించిన హర్మన్‌ప్రీత్ కౌర్, ఆమె జట్టుకు నా అభినందనలు. మిమ్మల్ని చూసి యావత్ క్రికెట్ ప్రపంచం గర్విస్తోంది. వెల్ డన్” అంటూ ప్రశంసించారు. 

భారత బౌలర్ పై సౌతాఫ్రికా కెప్టెన్ లారా ప్రశంసలు.. ఎవరిపైనంటే!

Laura Wolvaardt Lauds Shafali Vermas Bowling Performance

ప్రపంచకప్ ఫైనల్ లో భారత జట్టుపై ఓటమి తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్‌ భావోద్వేగానికి గురైంది. సెంచరీ సాధించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోవడంతో కన్నీటిపర్యంతమైంది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించింది. ఈ సందర్భంగా భారత జట్టు బౌలర్ షెఫాలీ వర్మపై లారా ప్రశంసలు కురిపించింది. షెఫాలీ అద్భుతంగా బౌలింగ్ చేసిందని కొనియాడింది. షెఫాలీకి బంతి ఇవ్వాలని హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచిందని వెల్లడించింది. షెఫాలీ బౌలింగ్ ను తాము సరిగ్గా అంచనా వేయలేకపోయామని అంగీకరించింది.

‘షెఫాలీ బౌలింగ్‌ మాకు సర్‌ప్రైజ్‌. చాలా నెమ్మదిగా బంతిని సంధిస్తూ కీలక సమయంలో ఇద్దరిని పెవిలియన్ కు పంపించింది. కీలక వికెట్లను కోల్పోవడంతో మేం నిరుత్సాహానికి గురయ్యాం. ఆమెకు మరిన్ని వికెట్లు ఇవ్వకూడదని చాలా పొరపాట్లు చేశాం. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వంటి మ్యాచుల్లో పార్ట్‌ టైం బౌలర్లకు వికెట్లు కోల్పోవడం సరికాదు. ఆమె బౌలింగ్‌ కోసం అస్సలు సన్నద్ధం కాలేదు’’ అని లారా వెల్లడించింది.

Related posts

పాక్ క్రికెట్‌లో భారీ మార్పులు .. అన్ని ఫార్మాట్లకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్?

Ram Narayana

మూడవ టీ20లో శ్రీలంకపై భారత్ ఉత్కంఠభరిత ‘సూపర్ ఓవర్’ విజయం…

Ram Narayana

టీం ఇండియా ఉత్తమ చెత్త ప్రదర్శన …టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ ఆశలు గల్లంతు

Ram Narayana

Leave a Comment