- గాంధీ కుటుంబం హామీ శిలాశాసనమేనని వ్యాఖ్య
- అందరూ కష్టపడితేనే తనకు ఈ బాధ్యత వచ్చిందన్న సీఎం
- కుల గణనపై అవగాహన సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి గాంధీ కుటుంబంపై పొగడ్తల వర్షం కురిపించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందని వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం హామీ ఇస్తే అది వంద శాతం నెరవేరుతుందని, మాట ఇచ్చాక మరో చర్చకు తావుండదని అన్నారు. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు కాంగ్రెస్ పార్టీ ద్రోహులేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నో దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి సోనియా గాంధీ సఫలీకృతం అయ్యారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జనాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు. తామంతా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి ఒక్కరిపైనా ఉందని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ అజెండాతోనే ప్రజల్లోకి వెళ్లామని, పార్టీ విధానాన్ని అమలు చేయడమే ప్రభుత్వ విధానమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీనే గుర్తింపు ఇచ్చిందని అన్నారు. అందరూ కష్టపడితేనే తనకు సీఎం బాధ్యత వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధ్యతగా పని చేస్తే కృషికి తగ్గ ఫలితం లభిస్తుందని పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ఆచరించే క్రమంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన ఎవరినైనా పార్టీ క్షమించబోదని హెచ్చరించారు. పని చేయాల్సిన బాధ్యత అధికారులపై కూడా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన కుల గణనపై అవగాహన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం
నవంబర్ 31లోగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుల గణనపై తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని సీఎం రేవంత్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచే ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటించాలని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా ప్రజలకు మాటిచ్చారని ప్రస్తావించారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు వీలుగా 33 జిల్లాలకు 33 మంది పరిశీలకులను నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.