- రాజకీయ పబ్బం కోసం వైసీపీ శక్తులు జనసేనలో చేరాయన్న చింతమనేని
- కూటమి ఓటమికి ప్రయత్నించిన వారే అధికారం చెలాయిస్తామంటే కుదరదని వ్యాఖ్య
- భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
ఇటీవల కొన్ని అరాచక శక్తులు జనసేన పార్టీలో చేరాయని, ఈ అంశంపై తాను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మాట్లాడుతానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ… రాజకీయ పబ్బం గడుపుకోవడానికి సదరు అరాచక శక్తులు జనసేనలో చేరాయని ఆరోపించారు. జనసేనలో చేరినవాళ్లు సైలెంట్‌గా ఉంటే మంచిదని హితవు పలికారు. పెన్షన్ల పంపిణీతో వారికి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. జనసేనలో చేరిన వారు గ్రామాల్లో గొడవలు సృష్టించే పద్ధతిని వీడాలని హితవు పలికారు.
ఎన్నికల సమయంలో కూటమి ఓటమికి ప్రయత్నాలు చేసినవారు ఇప్పుడు జనసేనలో చేరి అధికారం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై తాను ఆ పార్టీ అధినాయకత్వంతో మాట్లాడుతానన్నారు.
వైసీపీ వాళ్లు జనసేనలో చేరి… ఆ పార్టీ కండువాతో ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అరాచకశక్తులు జనసేనలో చేరి దాడులు చేయడం దారుణమన్నారు. పైడిచింతలపాడులో జరిగిన ఘటనను జనసేనాని దృష్టికి తీసుకువెళతానన్నారు.
ఏం జరిగింది?
దెందులూరు నియోజకవర్గం పైడిచింతలపాడులో ఇటీవల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ వర్గానికి చెందిన టీడీపీ నేతలను పిలువకుండానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది టీడీపీ, జనసేన మధ్య స్థానికంగా వివాదానికి దారితీసింది. పరస్పరం దాడి చేసుకోగా… ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.