Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రికెట్ వార్తలు

ముంబై టెస్టులో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందన ఇదే

  • జట్టుగా రాణించడంలో విఫలమయ్యామన్న కెప్టెన్
  • అంత తేలికగా జీర్ణించుకోలేని ఓటమి అని వ్యాఖ్య
  • మరింత మెరుగ్గా ఆడాల్సిందన్న రోహిత్ శర్మ

ముంబై టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాభవంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సమష్టిగా రాణించడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. తన నాయకత్వం కూడా ఆశించిన స్థాయిలో లేదని అన్నాడు. తాను సామర్థ్యం మేరకు కెప్టెన్సీ నైపుణ్యాలు ప్రదర్శించలేకపోయానని తెలిపాడు. 

“టెస్టు సిరీస్ ఓడిపోవడం, టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అంత సాధారణ విషయం కాదు. జట్టు అంత తేలికగా జీర్ణించుకోలేని ఓటమి ఇది. ఈ ఓటమి నాకు చాలా కాలం బాధ కలిగిస్తుంది. సమష్టిగా రాణించలేకపోవడమే ఈ ఓటములకు కారణం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.

‘‘మేము మరోసారి మా అత్యుత్తమ ప్రదర్శన చేయలేదు. ఈ విషయాన్ని మేము అంగీకరించాలి. న్యూజిలాండ్ ప్లేయర్లు మా కంటే చాలా మెరుగ్గా ఆడారు. మేము చాలా తప్పులు చేశాం. బెంగళూరు, పుణే టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌లో తగిన స్కోర్లు చేయలేక వెనుకబడ్డాం. అయితే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల ఆధిక్యాన్ని పొందాం. దీంతో ముందున్నామని అనుకున్నాం. లక్ష్యం కూడా సాధించగలిగేదే. కానీ మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది’’ అని రోహిత్ అభిప్రాయపడ్డాడు. 

ఇక వ్యక్తిగత ప్రదర్శన, సిరీస్ అంతటా దూకుడుగా బ్యాటింగ్ చేయడంపై ప్రశ్నించగా… మ్యాచ్‌లు గెలవనప్పుడు ఇలాంటి ప్రదర్శనలు మంచిగా కనిపించవని వ్యాఖ్యానించాడు. 

‘‘బోర్డ్‌పై పరుగులు ఉండాలని మీరు కోరుకుంటారు. నా మనసులో కూడా ఉండేది అదే. అనుకున్నది జరగకపోవడంతో మంచిగా అనిపించలేదు. బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు నా మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ సిరీస్‌లో అనుకున్నది జరగలేదు. అందుకు నాకు నిరాశగా ఉంది’’ అని చెప్పాడు. 

ఇక మూడవ టెస్ట్‌లో కీలకమైన పరుగులు రాబట్టిన ఇద్దరు బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్‌లపై రోహిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇలాంటి పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలో కుర్రాళ్లు చూపించారని మెచ్చుకున్నాడు.

Related posts

వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో టీమిండియా మళ్లీ టాప్!

Ram Narayana

కోహ్లీ, రోహిత్ శర్మ బాటలోనే రవీంద్ర జడేజా… టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్

Ram Narayana

17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డు…

Ram Narayana

Leave a Comment