- అధికార కాంగ్రెస్… విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మూసీ వార్
- మూసీ నిద్ర చేపట్టిన బీజేపీ నేతలు
- ఓ బస్తీలో కిషన్ రెడ్డి మూసీ నిద్ర
- ఒక్క రోజు నిద్రతో ఏం సాధించారన్న మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో అధికార కాంగ్రెస్… విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మూసీ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ సర్కారు భారీ ప్రాజెక్టు చేపట్టగా… తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు మూసీ నిద్ర పేరిట కార్యాచరణకు తెరలేపారు.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా మూసీ పరీవాహక ప్రాంతంలోని ఓ బస్తీలో మూసీ నిద్ర చేపట్టారు. దీనిపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మూసీ ప్రాజెక్టును ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మూసీ నిద్ర ఫొటోషూట్ కోసమేనని విమర్శించారు.
ఒక్క రోజు నిద్ర చేసి ఏం సాధించారని ప్రశ్నించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలలు ఉంటే అక్కడి ప్రజల అవస్థలు తెలుస్తాయని అన్నారు. మూసీ నది పక్కన 3 నెలలు బస చేయాలని సవాల్ చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తాను కూడా 3 నెలలు మూసీ పక్కనే బస చేస్తానని తెలిపారు. మూసీ ప్రజలు అనారోగ్యాల పాలవుతుండడం విపక్ష నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో గ్రాఫ్ పడిపోయినప్పుడు మాత్రమే కిషన్ రెడ్డి బయటికి వస్తారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.