- ఏడుగురు భారత జాలర్లను తీసుకెళుతున్న పాక్ షిప్
- కాపాడాలంటూ కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించిన మత్స్యకారులు
- రెండు గంటల పాటు ఛేజ్ చేసి ఏడుగురిని కాపాడిన నేవీ
భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్థాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది. అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు ఛేజ్ చేసి పాక్ అధికారుల చెర నుంచి మత్స్యకారులను విడిపించింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చింది.
భారత కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. అరేబియా సముద్రంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారుల బోటును పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అడ్డగించింది. బోటుపై దాడి చేసి సముద్రంలో ముంచేసింది. ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
పాక్ నౌక దాడి చేయడం ప్రారంభించగానే మత్స్యకారులు భారత కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు. భారత్- పాక్ మారటైమ్ సరిహద్దుకు చేరుకున్న కోస్ట్ గార్డ్ నౌక.. పాకిస్థాన్ నౌకను వెంటాడి అడ్డగించింది. పాక్ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించి తీరానికి చేర్చింది.