బాబ్బాబు.. మీరు ఆఫీసులకు రావొద్దు..ఇంటి నుంచే పని చేయండి.. ప్రభుత్వ ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం వినతి
- కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆదేశాలు
- కార్యాలయాల పని వేళలను సవరించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా
- రాజధానిలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా నమోదు
ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరుకోవడంతో అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉద్యోగులకు కీలక సూచన చేసింది. ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 422గా నమోదైంది. ఇది అత్యంత తీవ్రమైన పరిస్థితి.
నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిన్న ప్రభుత్వ కార్యాలయాల సమయాలను సవరించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వం కింద పనిచేసే కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేసేలా సవరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.