- ఏపీలో వాలంటీరు వ్యవస్థ తీసుకువచ్చిన గత ప్రభుత్వం
- ఇప్పుడదే బాటలో మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం
- కొన్ని అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బదులు వాలంటీర్లతో సేవలు
ఏపీలో గత ప్రభుత్వం వాలంటీరు వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం అప్పుడే స్పష్టత ఇచ్చారు. కాగా, బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ వాలంటీరు వ్యవస్థకు బీజం పడింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు.
గ్రామ పంచాయతీల పనితీరుపై పర్యవేక్షణ, వివిధ పథకాల అమలు వంటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించాలని మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. కాగా, బీజేపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించనున్నట్టు తెలుస్తోంది.
సీఎం మోహన్ యాదవ్ స్పందిస్తూ. పంట నష్టాన్ని పరిశీలించి, ఆ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తారని, ఆ వివరాలను ప్రభుత్వం పరిశీలించి పంట నష్టానికి పరిహారం చెల్లిస్తుందని వివరించారు. ఇలాంటి పనులకు ప్రభుత్వ ఉద్యోగికి బదులుగా వాలంటీరు సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.
ఇప్పటిదాకా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్వారీలదే రాజ్యమని… వాలంటీరు వ్యవస్థతో ఆ సంస్కృతికి చరమగీతం పాడతామని సీఎం మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. వాలంటీర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారి జాబితాలు కూడా తయారుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తారని వెల్లడించారు.