—
లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వాకింగ్ కోసం కేబీఆర్ పార్కుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా తరలించడంపై బీఆర్ఎస్ మండిపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ఆయనేమైనా టెర్రరిస్టా.. ఎందుకలా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులను ప్రశ్నించింది.
వాకింగ్ కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా అరెస్టు చేయడమేంటని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నాడా అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కోర్టు ప్రశ్నించింది. అదేవిధంగా, లగచర్ల ఘటనపై పోలీసులు ఇచ్చిన రిపోర్టునూ తప్పుబట్టింది. లగచర్లలో జరిగిన దాడిలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పిన పోలీసులు.. నివేదికలో మాత్రం చిన్న గాయాలైనట్లు పేర్కొన్నారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.