- డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 క్యాన్సర్ నయమైందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
- ఆయన వ్యాఖ్యలను ఖండించిన టాటా మెమోరియల్ ఆసుపత్రి ఆంకాలజిస్టులు
- ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని వైద్యుల సూచన
డైట్ కంట్రోల్ వల్ల తన సతీమణి నవజ్యోత్ కౌర్‌కు స్టేజ్-4 క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్) నయమైందంటూ భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై ముంబయిలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఆయన వ్యాఖ్యలను ఆసుపత్రికి చెందిన ఆంకాలజిస్టులు ఖండించారు. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ రోగులను వైద్యులు హెచ్చరించారు.
ఈ మేరకు టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేశ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. “పాల ఉత్పత్తులు, చక్కెర తినకపోవడం.. హల్దీ (పసుపు), వేప తినడం ద్వారా క్యాన్సర్‌ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి. శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి నిరూపితమైన చికిత్సలతో క్యాన్సర్‌ను నయం చేయవచ్చు” అని అన్నారు.
సిద్ధూ వ్యాఖ్యలకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని టాటా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన 262 మంది ఆంకాలజిస్టులు సంతకం చేసిన ప్రకటనలో తెలిపారు. క్యాన్సర్ నిరోధక ఏజెంట్‌లుగా వీటిని (పసుపు, వేప) ఉపయోగించడాన్ని సిఫారసు చేయడానికి ప్రస్తుతం క్లినికల్ డేటా ఏదీ లేదన్నారు. ఇవి అశాస్త్రీయమైన, నిరాధారమైన సిఫార్సులుగా డాక్టర్ ప్రమేశ్ పేర్కొన్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని క్యాన్సర్ రోగులకు సూచించారు.