- స్నేహితులతో కలిసి గోవా టూర్ కి వెళ్లిన బెస్త రాఘవ
- అక్కడి సముద్రంలో ఈత కొడుతుండగా గుండెపోటు
- స్నేహితులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి
స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దామని విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. గోవాలో సముద్రంలో ఈత కొడుతుండగా గుండె నొప్పి రావడంతో ఒడ్డుకు చేరుకున్నాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించేలోపే తుదిశ్వాస వదిలాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణానికి చెందిన బెస్త రాఘవ (30) మున్సిపాలిటీ లైసెన్స్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. స్నేహితులతో కలిసి గోవా టూర్ కి వెళ్లిన రాఘవ.. అక్కడి బీచ్ లో సరదాగా గడిపాడు.
మిగతా వారితో కలిసి సముద్రంలో ఈత కొడుతుండగా గుండెలో నొప్పి వచ్చింది. పక్కనే ఉన్న స్నేహితులకు చెప్పగా.. వారు రాఘవను ఒడ్డుకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్పృహ కోల్పోయిన రాఘవను వైద్యులు పరీక్షించి చనిపోయాడని నిర్ధారించారు. కాగా, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన కొడుకు విగతజీవిగా మారాడని తెలిసి రాఘవ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.