- పరిశ్రమ కోసం 1,300 ఎకరాలు సేకరించవద్దా? అని నిలదీత
- రైతుల కోసం 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న సీఎం
- బూర్గుల తర్వాత ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డకు సీఎంగా అవకాశం వచ్చిందన్న రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉందని, కానీ పరిశ్రమల కోసం 1,300 ఎకరాల భూమి మాత్రం సేకరించవద్దా? అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మాయమాటలు చెప్పే వారి మాటలు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘రైతు పండుగ’ సభలో సీఎం ప్రసంగించారు.
డెబ్బై ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 54 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. నవంబర్ 29వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని, సరిగ్గా ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లేశారన్నారు.
బూర్గుల రామకృష్ణారావు తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ తమ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇచ్చి వరి రైతులకు పండుగను తెచ్చిందన్నారు. లక్షల కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లు కాకముందే కూలిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వేటినీ అమలు చేయలేదని ఆరోపించారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.
“గతంలో ఎవరూ భూసేకరణ చేయలేదా? ప్రాజెక్టులు కట్టలేదా? పరిశ్రమలు తీసుకురాలేదా? నా జిల్లాకు పరిశ్రమ రావాలని నేను భావించాను. చెప్పుడు మాటలు విని లగచర్ల ప్రజలు కేసుల్లో ఇరుక్కున్నారు” అని వాపోయారు. జిల్లా అభివృద్ధికి భూసేకరణ చేయాలా? వద్దా? అని ప్రశ్నించారు. అధికారులను కొడితే శ్రీశైలం, నాగార్జున సాగర్ పూర్తయ్యేవా? అన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పే మాయమాటలు విని అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. నష్టపరిహారం ఎక్కువ ఇచ్చేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం మళ్లీ రాదన్నారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు.