- గతరాత్రి తీరం దాటిన ఫెయింజల్ తుపాను
- రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు
- తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
- బండరాళ్లను తొలగిస్తున్న టీటీడీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను గత రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోనూ తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో, తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం కలగకుండా, టీటీడీ జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తోంది.
ఫెయింజల్ తుపాను గత రాత్రి 10.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య కారైక్కాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని దాటింది. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ, నైరుతి దిశగా 120 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
గడచిన 6 గంటలుగా ఇది పశ్చిమ దిశగా పయనిస్తోందని, క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు… దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.