- క్రిమినల్ కేసుల్లో కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించిన బైడెన్
- హంటర్‌పై కేసులు రాజకీయ ప్రేరేపితమని ఆరోపణ
- తానీ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్ధం చేసుకుంటారన్న బైడెన్
అమెరికా అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే ముందు జోబైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్‌పై ఉన్న అక్రమ ఆయుధ కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడిపై ఉన్న కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపించారు. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో తాను జోక్యం చేసుకోబోనని, ఇదే విషయాన్ని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాడే చెప్పానని పేర్కొన్నారు. ఆ మాటకు కట్టుబడి ఉండి తన కుమారుడిని అన్యాయంగా విచారించే సమయంలోనూ మౌనంగానే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా హంటర్‌పై పెట్టిన కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు వివరించారు.
హంటర్‌పై కేసులు ఎందుకంటే?
హంటర్ బైడెన్ 2018లో తుపాకి కొంటూ ఆయుధ డీలర్‌కు ఇచ్చిన ఫారంలో తప్పుడు సమాచారం ఇచ్చారు. అయితే, తన వద్ద అక్రమ ఆయుధం లేదని, తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని తెలిపారు. ఈ రెండు విషయాల్లోనూ ఆయన చెప్పింది అబద్ధమని తేలింది. ఆయన 11 రోజులపాటు అక్రమ ఆయుధం కలిగి ఉండడంతోపాటు కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు కేసు నమోదైంది.
అక్రమ ఆయుధం కేసులో ఈ ఏడాది జూన్‌లో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించినా శిక్ష ఖరారు చేయలేదు. అప్పట్లో జో బైడెన్ మాట్లాడుతూ తన కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగే వేళ కుమారుడికి ఆ కేసుల నుంచి విముక్తి కల్పిస్తూ క్షమాభిక్ష ప్రసాదించడం చర్చనీయాంశమైంది.
బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్

- కొడుకుకు క్షమాభిక్ష పెట్టిన ప్రెసిడెంట్ బైడెన్
- ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని ట్రంప్ విమర్శ
- క్యాపిటల్ భవనం అల్లర్ల బందీలను క్షమించలేదేమని ప్రశ్న
ప్రెసిడెంట్ జో బైడెన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టారని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. బైడెన్ నిర్ణయం పూర్తిగా న్యాయ విరుద్ధమని ఆరోపించారు. క్రిమినల్ కేసుల నుంచి కొడుకును తప్పించేందుకు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారాలను బైడెన్ దుర్వినియోగపరిచారని మండిపడ్డారు. హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే క్యాపిటల్ హిల్ దాడి కేసులో బందీలను విడుదల చేయలేదేమని నిలదీశారు.
తుపాకీ అక్రమంగా కొన్నారని, ఆదాయపన్ను చెల్లింపు విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని హంటర్ బైడెన్ పై పోలీసులు గతంలో కేసులు నమోదు చేశారు. విచారణ తర్వాత కోర్టు హంటర్ ను దోషిగా తేల్చింది. అయితే, శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఈ కేసులకు సంబంధించి తాను కల్పించుకోబోనని ప్రెసిడెంట్ బైడెన్ గతంలో పేర్కొన్నారు. అయితే, తాజాగా హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో హంటర్ కు శిక్ష పడే అవకాశం లేదు. అధ్యక్ష హోదాలో కొడుకుకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టారు.