రైలు ఎక్కడానికి ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలు.. ఆ తర్వాత టికెట్ తీసుకోవచ్చు!
ప్లాట్ ఫామ్ టికెట్‌ను టీటీఈకి చూపించి వెళ్లాల్సిన స్టేషన్ కు టికెట్ తీసుకోవచ్చు
టికెట్ కోసం ప్రయాణికులు క్యూలైన్లలో నిలబడే కష్టాలు ఉండవు
ప్లాట్ ఫామ్ టికెట్ ను యాప్ లేక వెండింగ్ మిషన్ల ద్వారా తీసుకోవచ్చు
రైలులో ప్రయాణిస్తూనే ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు
రైలు ప్రయాణికులకు స్టేషన్‌లో టికెట్ తీసుకునే సమయంలో తలెత్తే ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ, వారి సౌకర్యార్థం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ ఉంటే చాలని, ఆ తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి ప్రయాణికులు వెళ్లాల్సిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపింది.
దీంతో టికెట్ కోసం ప్రయాణికులు క్యూలైన్లలో నిలబడే కష్టాలు ఉండవు. ప్లాట్ ఫామ్ టికెట్ ను యూటీసీ యాప్ ద్వారా లేక రైల్వే స్టేషన్లలోని వెండింగ్ మిషన్ల ద్వారా తీసుకోవచ్చు. దీంతో రైలు వచ్చే సమయం దగ్గరపడుతోందని, రైలు వెళ్లిపోతోందని, రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా వచ్చామని ప్రయాణికులు కంగారు పడే అవసరం లేదు.
అంతేకాదు, ఒకవేళ ప్రయాణికులు ఎక్కిన రైళ్లలో సీట్లు లేకున్నా, బెర్త్ దొరకనప్పటికీ రైలు ప్రయాణం చేయొచ్చు. అవసరమైతే రిజర్వేషన్ సైతం చేయించుకోవచ్చు. టికెట్ లేకుండా రైలు ఎక్కితే విధించే జరిమానాలను రైల్వే ప్రయాణికులు చెల్లించే అవసరం ఉండదు.
టికెట్ దొరకక, బెర్త్ ఉందో లేదో తెలియక రైలు ప్రయాణాలు వాయిదా వేసుకునే వారికి రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం శుభవార్తే. ప్లాట్ ఫామ్ టికెట్ తో రైలు ఎక్కిన వారు రైలులో ప్రయాణిస్తూనే ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది.