ఏటూరునాగారం ఎన్కౌంటర్ మృతులను భద్రపరచాలి హైకోర్టు ఆదేశం…
ఇది భూటకపు ఎన్కౌంటర్ అంటున్న పౌరహక్కుల సంఘం
మత్తు ఇచ్చి చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని కోర్టుకు తెలిపిన న్యాయవాది
ఏటూరునాగారం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని, కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారని కోర్టుకు వివరించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారన్నారు.
అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు చెప్పారు. పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి వరకు మృతదేహాలను భద్రపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకుచూపించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.