- అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు
- అదనపు లడ్డూల తయారీకి అవసరమైన సిబ్బంది నియామకానికి సిద్ధం
- డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టీటీడీ అడుగులు
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. భక్తిశ్రద్ధలతో తాము స్వీకరించడమే కాకుండా ఇరుగుపొరుగు వారికి కూడా పంచుతుంటారు. అందుకే తిరుమల వెళ్లినప్పుడు అవసరమైన సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కానీ టీటీడీ పరిమితి కారణంగా నిరాశే ఎదురవుతోంది. అయితే మున్ముందు భక్తులు అడిగినన్ని లడ్డూలు విక్రయించేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు అదనపు లడ్డూల తయారీకి కావాల్సిన పోటు సిబ్బందిని భర్తీ చేసుకునేందుకు అడుగులు వేస్తోంది.
భక్తుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టీటీడీ ఈ దిశగా కదులుతోంది. ఇందుకోసం మరో 74 మంది శ్రీవైష్ణవులు, 10 మంది శ్రీవైష్ణవేతరులను నియమించాలని నిర్ణయించింది. వీరి సాయంతో రోజుకు అదనంగా 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతానికి సాధారణ రోజుల్లో లడ్డూ విక్రయాల్లో పెద్దగా ఇబ్బందులు లేవు. అయితే వారాంతాలు, ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల వేళల్లో లడ్డూలకు ఎక్కువ గిరాకీ ఉంటోంది. అందుకే అదనపు లడ్డూల తయారీకి టీటీడీ నిర్ణయించింది.
కాగా దర్శనం చేసుకున్న భక్తులకు ప్రస్తుతం ఒక చిన్న లడ్డూను ఉచితంగా అందిస్తున్నారు. సరాసరిన 70 వేల మంది ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు 70 వేల ఉచిత లడ్డూలు ఇవ్వాల్సి ఉంటుంది. అదనపు తయారీ అందుబాటులోకి వస్తే అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే భక్తులకు విక్రయిస్తుంటారు. కాగా టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు (కల్యాణం లడ్డూ), 3,500 వడలను తయారు చేస్తోంది. వీటిని తిరుమలతో సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ విక్రయిస్తున్నారు.