- రాయచోటి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఘటన
- విద్యార్ధులు ఛాతిపై కొట్టడం వల్లే తన భర్త మృతి చెందాడంటున్న భార్య రెహమాన్
- కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు
విద్యార్ధుల ఆవేశానికి ఓ ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డాడు. ఈ దుర్ఘటన రాయచోటిలో జరిగింది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దు హైస్కూల్ ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ (42) రోజు మాదిరిగానే నిన్న 9వ తరగతి క్లాస్‌కు వెళ్లిన సమయంలో విద్యార్ధులు ఘర్షణ పడుతూ అల్లరి చేస్తున్నారు. ఘర్షణ పడుతున్న విద్యార్ధులను విడిపించే సందర్భంలో ఉపాధ్యాయుడు గట్టిగా మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన పలువురు విద్యార్ధులు ఉపాధ్యాయుడితో ఘర్షణకు దిగినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురి కావడంతో సహచర ఉపాధ్యాయులు అహ్మద్‌ను ప్రధానోపాధ్యాయుడి గదికి తీసుకువెళ్లి ఉపశమనం కోసం ట్యాబ్లెట్ ఇచ్చారు. అయితే కొద్ది సేపటికే ఆయన కుప్పకూలిపోవడంతో వెంటనే రాయచోటిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అహ్మద్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలిసి పోలీసులు వెళ్లి వైద్యులతో చర్చించారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అహ్మద్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత అతని భార్య రెహమాన్.. తన భర్త మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన భర్త ఛాతిపై ముగ్గురు విద్యార్ధులు బలంగా కొట్టడం వల్లనే చనిపోయాడని ఆరోపించింది. మృతికి కారణమైన వారిని ఉపాధ్యాయులు, పోలీసులు ఎందుకు కాపాడుతున్నారో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని ఆమె పేర్కొనడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అహ్మద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.