- అధిక రక్తపోటుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు
- ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం తప్పనిసరి అంటున్న నిపుణులు
- కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బీపీని సరిగా గుర్తించవచ్చని సూచనలు
అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తరచూ తమ శరీరంలో రక్తపోటు (బీపీ)ను చెక్ చేసుకుంటూ ఉండటం అవసరం. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా చెక్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సమయాల్లో… అది కూడా పలు జాగ్రత్తలు తీసుకుని చెక్ చేసుకుంటే రక్తపోటు స్థాయులు సరిగ్గా తెలుస్తాయని సూచిస్తున్నారు.
నిద్ర లేవగానే వద్దు…
- ఉదయం నిద్ర లేచిన వెంటనే బీపీ చెక్ చేసుకోవద్దు. కనీసం అరగంట నుంచి గంట పాటు ఆగాలి.
- అది కూడా… బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందే, ఎలాంటి మందులు కూడా వేసుకోకముందే చెక్ చేసుకోవాలి.
- ఐదు నిమిషాల పాటు విశ్రాంతిగా కూర్చుని, ఆ తర్వాత బీపీ చెక్ చేసుకోవాలి.
- ఒకసారి చెక్ చేసుకున్నాక… రెండు, మూడు నిమిషాల తర్వాత మరోసారి చెక్ చేయాలి. ఈ రెండింటి యావరేజ్ బీపీని పరిగణనలోకి తీసుకోవాలి.
- బీపీ చెక్ చేసుకున్న ప్రతిసారి ఆ రీడింగ్ ను రాసిపెట్టుకోవాలి. వైద్యులను కలిసినప్పుడు ఆ రికార్డ్ ను చూపించాలి.
సరైన బీపీ మెషీన్ తీసుకోండి
మార్కెట్లో, ఆన్ లైన్లో చాలా రకాల బీపీ మానిటరింగ్ మెషీన్లు దొరుకుతున్నాయి. తక్కువ ధరకు లభిస్తున్నాయి కదా, ఆన్ లైన్ లో మంచి రేటింగ్ ఉంది కదా అని ఏది పడితే అది తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సిఫార్సు చేసిన కంపెనీల బీపీ మెషీన్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.