- విమాన టికెట్లతో రప్పించి మరీ కిడ్నాప్
- ఢిల్లీ శివారు బిజ్నోర్ సమీపానికి తీసుకెళ్లి ఓ ఇంట్లో నిర్బంధం
- కోటి రూపాయలు డిమాండ్ చేసిన నిందితులు
- చివరికి ముస్తాక్, ఆయన కుమారుడి ఖాతా నుంచి రూ. 2 లక్షలు తీసుకుని పరార్
బాలీవుడ్ నటుడు ముస్తాక్‌ఖాన్ కిడ్నాప్‌కు గురయ్యారు. ఆపై కిడ్నాపర్ల చేతిలో 12 గంటలపాటు చిత్రహింసలు అనుభవించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా ‘వెల్కమ్’, ‘స్ట్రీట్ 2’ సినిమాల్లో నటించిన ముస్తాక్‌ను ఓ కార్యక్రమం పేరుతో ఆహ్వానించిన దుండగులు చిత్రహింసలకు గురిచేశారు. ఢిల్లీ-మీరట్ హైవేపై ఆయన కిడ్నాప్ అయినట్టు ముస్తాక్ వ్యాపార భాగస్వామి శివమ్ తెలిపారు.
నిందితులు విమాన టికెట్లతో ముస్తాక్‌ను ఆహ్వానించారు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా ఆయన ఖాతాకు పంపించారు. నటుడు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత నిందితులు ఆయనను కారులో కూర్చోమని చెప్పారు. ఆ తర్వాత కారులో ఢిల్లీ శివార్లలోని బిజ్నోర్ సమీపంలోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ ఆయనను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 12 గంటలపాటు చిత్రహంసలు పెట్టారు. అనంతరం ముస్తాక్, ఆయన కుమారుడి ఖాతా నుంచి రూ. 2 లక్షలకు పైగా తీసుకున్నారు.
కిడ్నాపర్ల నుంచి ముస్తాక్ ఎలా తప్పించుకున్నాడంటే..
ఉదయమే ముస్తాక్ కు ఆజాన్ వినిపించిందని, దీనిని బట్టి ఆ దగ్గరలోనే మసీదు వుండి ఉంటుందని ముస్తాక్ భావించి, ఆ ప్రదేశం నుంచి పారిపోయాడని శివమ్ తెలిపారు. ఆ తర్వాత ముస్తాక్ స్థానికులు, పోలీసుల సాయం అర్థించినట్టు తెలిపారు. ఈ ఘటనపై ముస్తాక్‌తోపాటు ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు పేర్కొన్నారు. ముస్తాక్ ఇప్పటికే ఫిర్యాదు చేసి ఉంటారని, తాను కూడా బిజ్నోర్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. విమాన టికెట్లు, విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీలు, బ్యాంకు ఖాతాలు ఆధారాలుగా ఉన్నట్టు చెప్పారు. తనను నిర్బంధించిన ఇంటిని, ఆ పరిసరాలను ముస్తాక్ గుర్తుపడతారని వివరించారు. నిందితులను పోలీసులు త్వరలోనే అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు.
కాగా, ఇటీవల కమెడియన్ సునీల్ పాల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తుండగా హరిద్వార్ హైవేపై ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. ఆయనను నిర్బంధించిన కిడ్నాపర్లు రూ. 20 లక్షలు డిమాండ్ చేశారు. చివరికి రూ. 8 లక్షలు ఇచ్చి బయటపడ్డారు.