జర్నలిస్ట్‌ను కొట్టింది నిజమే… అందుకు చింతిస్తున్నాను కానీ: మోహన్ బాబు
జర్నలిస్టును కొట్టాలనుకోలేదన్న మోహన్ బాబు
మీ ఇంట్లో ఎవరైనా దూరితే అంగీకరిస్తారా? అని ప్రశ్న
మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటివాడన్న మోహన్ బాబు
కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని విజ్ఞప్తి
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మోహన్ బాబు
నేను మీడియా ప్రతినిధిని కొట్టిన మాట నిజమే… కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని, అయినప్పటికీ అలా కొట్టినందుకు చింతిస్తున్నానని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక వెల్లడించారు. ఈ మేరకు 11 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేశారు.
జర్నలిస్టును కొట్టాలనుకోలేదు… చింతిస్తున్నా
జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేవారు జర్నలిస్టులా? కాదా? తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మీడియాను అడ్డు పెట్టుకొని తనపై దాడి జరగవచ్చని భావించానన్నారు. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. తాను కొట్టడం తప్పే కావొచ్చు… కానీ ఏ సందర్భంలో అలా చేశానో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు.
మీ ఇంట్లో ఎవరైనా దూరితే… మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే అంగీకరిస్తారా?… న్యాయాధిపతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు దీనిపై ఆలోచించాలన్నారు. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందన్నారు. అందుకు బాధపడుతున్నానని… ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి తాను ఆలోచించానని… కానీ తన గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. తాను సినిమాల్లో నటిస్తానని… నిజజీవితంలో మాత్రం నటించాల్సిన అవసరం లేదన్నారు.
మీకు టీవీలు ఉన్నాయి… మాకు టీవీలు (చానళ్లు) లేవు… రేపు నేను కూడా టీవీని పెట్టవచ్చు… అది కాదు గొప్ప… కానీ మీడియా ప్రతినిధి మనసును గాయపర్చినందుకు చింతిస్తున్నానన్నారు. మనసును గాయపెట్టాక చింతించి లాభం ఏమిటని ఎవరైనా అడిగితే ఇక నేనేం చేయను… మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను… అసలు అతను నిజంగా జర్నలిస్టా? కాదా? అని నాకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో చూడాలన్నారు. కానీ మీరు ఈ విషయాలు చెప్పడం లేదన్నారు. పైన భగవంతుడు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
పోలీసులు అంటే తనకు ఇష్టమని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తన విశ్వవిద్యాలయం నుంచి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారన్నారు. వారికి తన విద్యాసంస్థల నుంచి న్యాయం, ధర్మం నేర్పించానన్నారు. తన విద్యాసంస్థల నుంచి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వారు న్యాయంగా ఉన్నారని, కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? ప్రజలే ఆలోచించాలన్నారు. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? అని అడిగారు.
తనకు ఉన్న ధైర్యం ఒకటేనని… నీతిగా, ధర్మంగా బతకాలన్నదే తన ఆలోచన అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి, దాడి చేస్తే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని… అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చన్నారు. తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయేవాడినన్నారు. కానీ నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నా బిడ్డే నా ప్రశాంతతను చెడగొడుతున్నాడు
తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొడుతున్నాడని ఆరోపించారు. నా బిడ్డతో ఏదో ఒకరోజు సఖ్యత కుదురుతుందని, కుటుంబ సభ్యులం కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. కుటుంబ సభ్యుల గొడవలకు మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని… కానీ అన్నీ మరిచిపోయి తాను కొట్టిన విషయమే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొట్టింది వాస్తవమేనని… అసత్యమేమీ కాదన్నారు.
సినీ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు!
మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో సినీ నటుడు మంచు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు తాజాగా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆయనపై 118(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఇక మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంచు మనోజ్ ఇంటి గేట్లను తన్నుకుంటూ లోపలికి వెళ్లడంతో మీడియా ప్రతినిధులు కూడా నివాసం లోపలికి వెళ్లడం జరిగింది. అదే సమయంలో ఇంట్లోంచి బయటకు వచ్చిన మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కుని ముఖంపై దాడి చేశారు.
దాంతో మీడియా ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు కూడా బౌన్సర్లు మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలోనే కేసు నమోదైంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు
మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చేరారు. విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఎడమ కంటి కింద గాయమయింది. బీపీ పెరిగింది. గుండె కొట్టుకోవడంలో కూడా హెచ్చుతగ్గులు కనిపించాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు.
మోహన్ బాబు ఫ్యామిలీ గొడవపై పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్పందన
సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ విషయంలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు నివాసంలో జరిగింది వాళ్ల వ్యక్తిగతమని… అయితే వాళ్ల వల్ల పబ్లిక్ డిస్టర్బ్ కాకూడదని చెప్పారు. జల్ పల్లిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నందువల్లే ముగ్గురికీ నోటీసులు ఇచ్చామని తెలిపారు.
ఇకపై మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఉండటానికి వీల్లేదని సుధీర్ బాబు చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి చెక్ చేయమని పహాడీ షరీఫ్ పోలీసులకు సూచించామని తెలిపారు. తమ నోటీసులకు స్పందించి తమ ఎదుట మనోజ్ హాజరయ్యారని చెప్పారు. మనోజ్ ను సంవత్సరం పాటు బైండోవర్ చేస్తూ ఆదేశాలిచ్చామని తెలిపారు. బైండోవర్ నోటీసుకు కొంత సమయం కావాలని విష్ణు కోరారని… ఈ నెల 24వ తేదీ వరకు ఆయనకు సమయం ఇచ్చామని వెల్లడించారు. మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు మేనేజర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.