అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి దుర్మరణం పాలయ్యారు. పట్టణానికి చెందిన వ్యాపారి గణేశ్-రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) ఎంఎస్ చేసేందుకు రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుకుంటున్నారు.
శుక్రవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ బలంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. పరిమళ మృతి విషయం తెలిసి తెనాలిలోని ఆమె ఇంటి వద్ద విషాదం అలముకుంది. పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపేందుకు ‘తానా’ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.