- అసెంబ్లీలో ప్రభుత్వ తీరును అందరూ గమనిస్తున్నారన్న కేటీఆర్
- రైతుల తరపున పోరాటం చేస్తామని వ్యాఖ్య
- ప్రభుత్వ అరాచకాలను సభలో నిలదీస్తామన్న కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును శాసనసభలో చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ క్రమంలో సభ రేపటికి వాయిదా పడింది. దీంతో, శాసనసభ లోపలికి వెళ్లే దారిలో కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ముగ్గురు లగచర్ల రైతులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతుకు గుండెపోటు వస్తే బేడీలతో ఆసుపత్రికి తీసుకెళ్లారని మండిపడ్డారు. కొడంగల్ నీ జాగీరా? అని రేవంత్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. రైతుల తరపున పోరాటం చేస్తామని చెప్పారు.
అదానీతో రేవంత్ దోస్తీని నిలదీయాలనే ఉద్దేశంతో వారి ఫొటోలు ఉన్న టీషర్టులతో వస్తే అసెంబ్లీలోకి వెళ్లనీయలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను సభలో నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? అరాచక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు.