- పని చేసిన బార్‌లోనే చోరీకి పాల్పడిన కార్మికుడు
- నిందితుడిని పట్టుకున్న రాయదుర్గం పోలీసులు
- పరారీలో మరో యువకుడు
పనిలో నుంచి తీసేశారన్న కోపంతో ఓ కార్మికుడు ఆ షాపులోనే చోరీకి పాల్పడి పోలీసులకు దొరికిపోయిన ఘటన శేరిలింగంపల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శుభం కుమార్ జెనా, బిశ్వజిత్ పండా యూసుఫ్ గూడలో నివాసం ఉంటున్నారు. శుభం కుమార్ జెనా గచ్చిబౌలి నాలెడ్జి సిటీలోని టీవర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో పని చేశాడు.
అయితే శుభం కుమార్ పని తీరు బాగాలేదని మూడు నెలల క్రితం బార్ యాజమాన్యం అతన్ని పనిలో నుంచి తొలగించింది. అదే సమయంలో శుభం కుమార్ జెనా స్నిహితుడు బిశ్వజిత్ పండాకు కూడా ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉన్నాడు. తనను పనిలో నుంచి తీసేశారన్న కోపంతో బార్ యాజమాన్యంతో కోపంగా ఉన్న శుభం కుమార్ జెనా .. బార్ లో చోరీ చేయాలని స్నేహితుడు బిశ్వజిత్ పండాతో కలిసి ప్లాన్ చేశాడు. ఇందు కోసం శుభం కుమార్ జెనా ఓ బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు.
ఈ నెల 9న ఉదయం ఆరు గంటల సమయంలో శుభం కుమార్, బిశ్వజిత్ పండా ముఖాలకు ముసుగులు ధరించి బార్ సెక్యూరిటీ గార్డును బెదిరించి స్టోర్ రూమ్‌లో బంధించారు. కౌంటర్ తాళాలు తీసుకుని లాకర్‌లో ఉన్న 4.50 లక్షల నగదు, ఐ ప్యాడ్, ల్యాప్ టాప్‌లు ఎత్తుకొని పారిపోయారు. ఈ ఘటనపై బార్ యజమాని శ్యామ్ అనిరుద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో ఒడిశాకు వెళ్తున్న శుభంకుమార్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానంలో హజరుపర్చారు. మెజిస్ట్రేట్ రిమాండ్ ఉత్తర్వులు ఇవ్వడంతో అతన్ని జైలుకు తరలించారు. బిశ్వజిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.