- మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో ఘటన
- తమ ఫ్యామిలీ ఫొటోలు తీసేందుకు యత్నించడంతో ఆగ్రహం
- తమకు ప్రైవసీ కావాలని వ్యాఖ్య
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి దూకుడు స్వభావం కొంత ఎక్కువనే చెప్పుకోవచ్చు. తాజాగా మరోసారి ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా జట్టు తదుపరి టెస్ట్ మ్యాచ్ ను మెల్బోర్న్ లో ఆడబోతోంది. ఈ క్రమంలో తన భార్య అనుష్క, పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి కోహ్లీ మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళా టీవీ జర్నలిస్టుతో ఆయన వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
ఆస్ట్రేలియా మీడియాకు చెందిన సదరు మహిళా జర్నలిస్టు తన ఫ్యామిలీ చిత్రాలు, వీడియోలను తీయాలని ప్రయత్నించడంతో కోహ్లీ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమకు ప్రైవసీ కావాలని అన్నాడు. తమ పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలు ఎలా తీస్తారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.