- మెగా వేలంలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్‌కు భారీ ధర పలకొచ్చని అంచనాలు
- లక్నో పేసర్ మయాంక్ యాదవ్‌పై కూడా ఫ్రాంచైజీలు కన్నేస్తాయని క్రికెట్ వర్గాల్లో విశ్లేషణలు
- గత ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.24.75 కోట్లు ధర పలికి రికార్డు సృష్టించిన మిచెల్ స్టార్క్
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభానికి చాలా సమయం ఉంది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించిన సందడి మొదలైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం తర్వాత తిరిగి మరోసారి జరగనున్న ఈ మెగా వేలంపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. భవిష్యత్తు జట్టును సిద్ధం చేసేందుకు యాజమాన్యాలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి.
బీసీసీఐ నిబంధనలు, ఏయే ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవాలనే అంశాలపై యాజమాన్యాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి. మెగా వేలం నిర్వహించడం సరికాదంటూ కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వేలం జరగడం ఖాయమైంది. దీంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఎవరు నిలవనున్నారు? ఎవరు ఏ జట్టుకు ఆడబోతున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
గత ఐపీఎల్ సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ వేలంలో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఏకంగా రూ.24.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని దక్కించుకుంది. మరి ఈ రికార్డు మెగా వేలంలో బద్దలు కానుందా? స్టార్క్ రికార్డును భారతీయ క్రికెటర్లు ఎవరైనా బద్దలు కొట్టనున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది.
మిచెల్ స్టార్క్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న ముగ్గురు భారతీయ క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మయాంక్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్సీ నుంచి తొలగించింది. దీంతో ఫ్రాంచైజీని వీడవచ్చంటూ కథనాలు వెలువడుతున్నాయి. బ్యాటింగ్ పరంగా అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశాలు ఉన్నాయి.
ఇక వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌పై కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్ను వేసే సూచనలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పంత్ మంచి ఫామ్‌లో ఉండడమే దీనికి కారణంగా ఉంది. గత ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచ కప్ 2024లో కూడా అతడు రాణించాడు. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ కు కూడా భారీ ధర పలుకొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో అతడు ఏకంగా 156.7 కి.మీ.ల వేగంతో బంతిని విసిరి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.