Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ఫైర్.. సంధ్య థియేటర్ ఘటనకు ఆయనే కారణం …

సినీ హీరో అల్లు అర్జున్ పై శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అల్లు అర్జున్ మనిషేనా అని ప్రశ్నించిన రేవంత్… ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని, థియేటర్ బయట పరిస్థితి బాగోలేదని, మీరు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోకపోతే పరిస్థితి అదుపుతప్పుతుందని డీసీపీ చెప్పినా… సినిమా చూసి వెళతానని అల్లు అర్జున్ చెప్పారని మండిపడ్డారు.

మీరు వెళ్లకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని డీసీపీ హెచ్చరించి, ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారని తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోకుండా… కారు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి, చేతులు ఊపుతూ వెళ్లాడని విమర్శించారు. అంత జరిగిన తర్వాత కూడా చేతులు ఊపుతూ ఉన్నాడంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఒక మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని చెప్పారు.

ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతించబోమని రేవంత్ స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు కుదరవని, టికెట్ ధరల పెంపు ఉండదని అన్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. థియేటర్ వద్దకు హీరో, హీరోయిన్లు రావద్దని చెప్పినప్పటికీ లెక్క చేయకుండా అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు. ఆ సందర్భంగా తొక్కిసలాట చేసుకుని మహిళ మృతి చెందిందని… ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలంటూ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో కోరారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీలో సంధ్య థియేటర్ గురించి మాట్లాడాల్సి వస్తుందని తాను అనుకోలేదని… ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉందని… అందువల్ల ఎక్కువగా మాట్లాడటం సరికాదని… దర్యాప్తు అధికారి ఇబ్బంది పడే అవకాశం ఉందని రేవంత్ చెప్పారు.

సంధ్య థియేటర్ వద్దకు రావద్దని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ వచ్చారని తెలిపారు. ఎక్స్ రోడ్ ముందు నుంచే రోడ్ షో చేసుకుంటూ కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ వచ్చారని… ఆ సమయంలో అభిమానులు వేల సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో రేవతి చనిపోయారని, ఆమె కుమారుడికి బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లు అర్జున్ ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని రేవంత్ చెప్పారు. 20 రోజులుగా ఆసుపత్రిలో చిన్నారి కోమాలో ఉంటే ఇంత వరకు ఒక్క సినీ ప్రముఖుడు కూడా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించలేదని రేవంత్ విమర్శించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా? కాలు పోయిందా? ఎందుకు అందరూ ఆయన దగ్గరకు వెళ్లి ఓదారుస్తున్నారని మండిపడ్డారు. ఒక సినీ నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొక్కిసలాట జరిగిందని చెబితే, మన సినిమా హిట్టయినట్టే అన్నాడట… అల్లు అర్జున్ పై అక్బరుద్దీన్ ఫైర్

Akbaruddin Owaisi take a dig at Allu Arjun over Sandhya Theater incident
  • అసెంబ్లీలో అక్బరుద్దీన్ ప్రసంగం
  • అల్లు అర్జున్ పేరెత్తకుండా తీవ్ర విమర్శలు
  • తాము కూడా బహిరంగ సభలకు వెళుతుంటామని వెల్లడి
  • కానీ తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తపడతామని స్పష్టీకరణ 

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిందని ఆ హీరోకు పక్కనున్న వాళ్లు చెప్పారని, అలాగైతే మన సినిమా హిట్టయినట్టేనని ఆ హీరో అన్నట్టు తనకు తెలిసిందని వెల్లడించారు. 

“నాకున్న సమాచారం మేరకు… ఆ హీరో థియేటర్ కు వచ్చి సినిమా చూస్తుంటే… బయట తొక్కిసలాట జరిగిందని పోలీసు అధికారులు వచ్చి ఆ హీరోకు చెప్పారు. ఒక మహిళ మృతి చెందిందని, ఒక బాలుడు కిందపడిపోయాడని వారు ఆ హీరోకు వివరించారు. దాంతో ఆ హీరో ఆనందంగా… ఇక మన సినిమా హిట్టయినట్టే అన్నాడట. 

ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆ పిల్లవాడు తీవ్ర గాయాల పాలయ్యాడు… అయినా గానీ ఆ హీరో థియేటర్లో కూర్చుని సినిమా చూస్తూనే ఉన్నాడు. థియేటర్ బయటికి వచ్చి కూడా వాహనం పైనుంచి చేయి ఊపుతూ వెళ్లాడంటే ఏమనాలి? ఇది మానవీయ వైఖరేనా? 

నేను కూడా బహిరంగ సభలకు హాజరవుతుంటాను… ఆ సభలకు వేలాదిగా ప్రజలు వస్తుంటారు… కానీ ఎక్కడా తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడతాను. నా చుట్టూ ఉన్న సెక్యూరిటీ వాళ్లు ప్రజలను నెట్టివేయకుండా చూసుకుంటాను” అని అక్బరుద్దీన్ వివరించారు.

Related posts

 62,641 కోట్ల నష్టంలో డిస్కంలు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క వెల్లడి

Ram Narayana

మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ శాసనసభ…

Ram Narayana

ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో… చూస్తా అనడం సరికాదు: కూనంనేని

Ram Narayana

Leave a Comment