- ఎవరి బెనిఫిట్ కోసం బెనిఫిట్ షోలు వేస్తున్నారన్న బండారు సత్యనారాయణ
- ప్రభుత్వం నుంచి ఎందుకు అనుమతులు తీసుకుంటున్నారని నిర్మాతలకు ప్రశ్న
- బెనిఫిట్ షోలు ఆపేయాలంటూ డిమాండ్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప-2 బెనిఫిట్ షో వ్యవహారం ఎంతటి వివాదానికి దారితీసిందో తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగ్గా, రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 9 ఏళ్ల శ్రీతేజ్ తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11 పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా… ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటికి వచ్చాడు.
ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి బెనిఫిట్ షోల అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. బెనిఫిట్ షోలు ఎవరి కోసమో చిత్ర పరిశ్రమ వర్గాలు చెప్పాలని నిలదీశారు.
“సినిమా వాళ్లను, నిర్మాతల మండలిని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరి బెనిఫిట్ కోసం మీరు బెనిఫిట్ షోలు వేస్తున్నారు? ఎందుకు ప్రభుత్వం నుంచి మీరు అదనంగా అనుమతులు తీసుకుంటున్నారు? మీ లాభాల కోసం ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు బెనిఫిట్ షోలు వేసి, వాటి ద్వారా వచ్చిన డబ్బును సమాజ శ్రేయస్సు కోసం వాడేవారు. ప్రజా శ్రేయస్సు ఉద్దేశం ఉన్నప్పుడే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలి. నిర్మాతల కోసమో, డబ్బులు ఉన్నవాళ్ల కోసమే బెనిఫిట్ షోలకు అనుమతి ఎందుకివ్వాలి? అందుకే బెనిఫిట్ షోలు ఆపేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను” అని బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు.